Idream media
Idream media
ఆరోపణలు, విచారణ, అరెస్ట్‌లు, కోర్టు స్టేలు.. ఇవీ ఇప్పటి వరకూ అమరావతి భూ కుంభకోణంలో జరిగిన పరిణామాలు. తప్పు చేసిన వారిని వదిలేసి, అది తప్పు అని చెప్పిన వారిని, అందుకు ఆధారాలు ఇచ్చిన వారిని శిక్షించాలనేలా పరిస్థితులు మారుతున్నాయి. అమరావతి భూ కుంభకోణంలో సుప్రిం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయగా.. సీఎం వైఎస్ జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనీ, చర్యలు తీసుకోవాలంటూ ఓ వర్గం తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తోంది.
తాజాగా ఈ వ్యవహారంలో ఏసీబీకి సహకరించిన బ్యాంకు ఉద్యోగులపై పనిష్మెంట్ బదిలీ వేటు వేయడం చర్చనీయాంశమవుతోంది. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందు అక్కడ భూములు కొన్న జస్టిస్ ఎన్‌వీ రమణ కుమార్తెలు భువన, తనూజలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించింది. ఈ క్రమంలో నాడు క్రయవిక్రయాలకు సంబంధించి జరిపిన బ్యాంకు లావాదేవీలపై అనుమానంతో వాటిపై దృష్టి పెట్టిన ఏసీబీ.. ఆ వివరాలను సేకరించింది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ ఆంధ్రబ్యాంకు శాఖలో వారి లావాదేవీలు జరిగాయి.
జస్టిస్ ఎన్‌వీ రమణ కుమార్తెలు భువన, తనూజ బ్యాంకు ఖాతాల లావాదేవీలు ఇవ్వాలని ఏసీబీ బ్యాంకు ఉన్నతాధికారులకు లేఖ రాయగా.. ఈ మేరకు బ్యాంకు అధికారులు ఇవ్వొచ్చా..? లేదా..? అనే విషయంపై బ్యాంకు లీగల్ విభాగం నుంచి సలహా తీసుకుని ముందుకు వెళ్లారు. వివరాలు ఇవ్వొచ్చన్న లీగల్ విభాగం సలహా మేరకు ఆన్‌లైన్‌లో లెడ్జర్ వివరాలు తీసిన బ్యాంకు అధికారులు వాటిని ఏసీబీకి అందజేశారు.
అయితే ఏసీబీకి ఈ వివరాలు ఇచ్చిన బ్యాంకు అధికారులపై తాజాగా పనిష్మెంట్ బదిలీ వేయడం బ్యాంకు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నలుగురు అధికారుల్లో ఇద్దరిని చెన్నై, మరో ఇద్దరిని ముంబైలకు బదిలీ చేశారు. నలుగురిలో ఇద్దరు మహిళా అధికారులున్నారు. కోవిడ్ సమయంలో బదిలీలపై నిషేధం ఉన్నా.. ఆ నలుగురుపై బదిలీ వేటు వేయడం వెనుక ఏమి జరిగిందన్న చర్చ సాగుతోంది. బ్యాంకు ఉన్నతాధికారులపై ఎవరు ఒత్తిడి తెచ్చారనే ప్రశ్న ఉద్భవిస్తోంది. నిబంధనల మేరకే అధికారులు పని చేసినా..వారిని బదిలీ చేయడంపై బ్యాంకు యూనియన్లు స్పందించకపోవడం ఇక్కడ అనేక అనుమానాలకు, సందేహాలకు తావిస్తోంది.
జస్టిస్ ఎన్‌వీ రమణ, ఆయన కుమార్తెలతో సహా 13 మందిపై ఏసీబీ దర్యాప్తుపై స్టే ఇవ్వడంతోపాటు.. గ్యాంగ్ ఆర్డర్ ఇస్తూ ఎఫ్‌ఐఆర్ వివరాలు వెల్లడించకూడదని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఏమేమి వివరాలు ఉన్నాయన్న విషయం బయట ప్రపంచానికి తెలియదు. ఈ క్రమంలో బ్యాంకు లావాదేవీలు కూడా ఏసీబీ సేకరించిందన్న విషయం బ్యాంకు ఉద్యోగుల బదిలీతో తేటతెల్లమైంది.
ఇంతకూ ఏసీబీ అధికారులు అనుమానంతో సేకరించిన బ్యాంకు లావాదేవీల్లో ఏముంది..? ఎంత మేర ఆయా ఖాతాల నుంచి లావాదేవీలు జరిగాయి..? ఒక వేళ భారీ మొత్తంలో లావాదేవీలు జరిగితే.. ఆ మొత్తం వారికి ఎలా వచ్చింది..? అనే సందేహాలు ప్రజల్లో మెదిలే అవకాశం ఉంది. ఈ సందేహాలు, ప్రశ్నలన్నింటకీ సమాధానం లభించాలంటే.. ఏసీబీ విచారణ తిరిగి ప్రారంభం అయితే తప్పా జవాబు దొరకడం కష్టమవుతుంది.