అజిత్ జోగి పరిస్థితి విషమం

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమించి కోమాలోకి జారుకున్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేమని ప్రకటించారు.ఆయనకు రాబోయే 48 నుండి 72 గంటలు చాలా కీలకమని తెలిపింది.ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అజిత్ ఆరోగ్యం గురించి తాజాగా విడుదల చేసిన మెడికల్ బులిటెన్ లో ఆయన శ్వాస తీసుకోవడంలో తలెత్తిన ఇబ్బందులతో బ్రెయిన్‌కు ఆక్సిజన్ సరఫరా సరిగా లేక కోమాలోకి జారుకున్నారని పేర్కొన్నారు.

శనివారం ఉదయం మాజీ సీఎం అజిత్ జోగి అల్పాహారం తినేటప్పుడు ప్రమాదవశాత్తూ అందులోని చింతపండు గింజ ఆయన శ్వాస నాళంలో జారుకొని ఇరుక్కుంది.దీంతో ఇంట్లోనే ఆయన స్పృహ తప్పి కుప్పకూలారు.కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతున్న ఆయనకు గుండెపోటు వచ్చిందని మొదట అంతా భావించారు.కానీ అలాంటిదేమీ లేదని నిర్ధారించుకున్న డాక్టర్లు ఆయన శ్వాసనాళంలో ఇరుక్కున్న గింజను ఆపరేషన్ చేసి తొలగించారు.ప్రస్తుతం ఆయన రాయపూర్‌లోని శ్రీనారాయణ హాస్పిటల్‌లో వెంటిటేటర్‌పై అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇప్పటికీ ఆందోళనగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అజిత్‌ జోగి 2000-2003 మధ్య కాలంలో పనిచేశారు.2016లో కాంగ్రెస్‌ను వీడి సొంతంగా జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఆయన మర్వాహీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Show comments