Agnipath protest- Secundrabad సికింద్రాబాద్ లో అగ్నిప‌థ్, ర‌ణ‌రంగ‌మైన స్టేష‌న్

కేంద్రం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ పై దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న నిర‌స‌న‌లు హైద‌రాబాద్ ను తాకాయి.
ఆర్మీలో నాలుగేళ్ల సర్వీసులకోసం వ‌చ్చిన‌ అగ్నిపథ్‌ పథకాన్ని నిర‌సిస్తూ, దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిర‌స‌న‌లు సాగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ దగ్గర ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. టెంప‌రీ అగ్నిప‌థ్ వ‌ద్దు, య‌థావిధిగా సైనిక ఎంపిక కొన‌సాగాలంటూ డిమాండ్ చేస్తూ, ఒకటో నంబరు ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న‌ రైలు ఇంజను ఎదుట నిల‌బ‌డ్డారు. బ్యానర్లతో నినాదాలు చేశారు. యువ‌కులు ఉద్రిక్త‌త‌త‌కు లోనుకావ‌డంతో నిర‌స‌న‌ అదుపు తప్పింది.

హైద‌రాబాద్ నుంచి కోల్ క‌తా వైపు వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు నిప్పంటించారు. అక్క‌డితో ఆగ‌లేదు. పార్సిల్‌ కార్యాలయంలోకి చొరబడి, అక్క‌డి వస్తువునుల బయటకు తీసుకువచ్చారు. రైల్వే పట్టాలపై వేశారు. తగల బెట్టారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ అంతా నల్లని దట్టమైన పొగలు. ఈస్ట్‌కోస్టుతో పాటు అజంతా, ఒక ఎంఎంటీఎస్‌ రైలు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి.

స్టేషన్ లో ఉన్న షాపులు, డిస్ ప్లే బోర్డుల‌ను ధ్వంసం చేయ‌డంతో ర‌ద్దీగా ఉంటే స్టేష‌న్ లో అల్ల‌క‌ల్లోలం.ప్రయాణం స్టేషన్‌కు వచ్చిన వారు పరుగులు తీశారు. స్టేషన్‌లో దట్టమైన పొగలు. ఇది చూసి ఆందోళ‌న‌కారులు మ‌రింత‌గా రెచ్చిపోయారు. అరగంట పాటు స్టేషన్‌లో ఏం జరుగుతుందో ఎవ‌రికీ అర్ధంకాలేదు. ఒక‌రిని చూసి మ‌రొక‌రు విధ్వంసానికి పాల్ప‌డ్డారు.

ఆందోళనల‌తో రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చే అన్ని రైళ్లను ఎక్కడిక్కడే ఆపేశారు. పోలీసు బల‌గాలూ వ‌చ్చాయి. స్టేషన్‌లో ఉన్నవారిని బయటకు పంపించారు. లాఠీఛార్జ్ చేస్తే ప‌రిస్థితి మ‌రింత విష‌మిస్తుంద‌న్న అంచ‌నాతో, ఆందోళన కారులకు పోలీసులు ‍నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

పదిన్నర తర్వాత పోలీసుల బలగాలు భారీగా స్టేష‌న్ కు వ‌చ్చాయి. టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించి ఆందోళ‌నకారుల‌ను చెల్లాచెదురు చేసేందుకు ప్ర‌త్నించారు. కాని పోలీసుల‌పై రాళ్లు రువ్వ‌డంతో ప‌రిస్థితి మ‌రింత ముదిరింది. నిర‌స‌న‌కారులు వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో గాల్లోకి కాల్పులు జ‌రిపారు. మరోవైపు స్టేషన్‌కు చేరుకున్న ఫైర్‌ ఫైటర్లు మంటలను అదుపు చేస్తున్నారు.

Show comments