iDreamPost
iDreamPost
రానురాను మన ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోతోంది. మచ్చలేని వ్యక్తిత్వం, ప్రజాసేవపై చిత్తశుద్ధి కలిగిన వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశాలు మృగ్యం అవుతున్నాయి. నేరచరిత్ర కలిగినవారు, కోట్లకు పడగలెత్తినవారికే రాజకీయ పార్టీలు పెద్దపీట వేసి టికెట్లు ఇస్తుండటంతో వారే ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధుల అవతారం ఎత్తుతున్నారు. సామాన్యులు, ప్రజాసేవకులు ఎన్నికల వ్యవస్థకు దూరం అవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పంజాబ్ బరిలో ఉన్న అభ్యర్థుల చరిత్రను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. రాష్ట్రంలో 117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం 1304 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 25 శాతం అంటే నాలుగోవంతు మంది నేరచరితులు కాగా.. ఏకంగా 41 శాతం మంది కోటీశ్వరులు కావడం విశేషం .అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) ఒక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. నామినేషన్ల సందర్భంగా 1276 మంది అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. మిగిలిన 28 మంది సరైన వివరాలు పేర్కొనకపోవడంతో వారిని పరిగణనలోకి తీసుకోలేదు.
మూడురెట్ల పెరుగుదల
2017 ఎన్నికల నాటికంటే ప్రస్తుత ఎన్నికల్లో నేరచరితుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. గత ఎన్నికల్లో క్రిమినల్ కేసులున్న 100 మంది (9 శాతం) పోటీ చేయగా.. ఈసారి ఏకంగా 315 మంది (25 శాతం) బరిలో సవాల్ చేస్తున్నారు. అత్యధికంగా శిరోమణి అకాలీదళ్ నుంచి 65 మంది, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి 58 మంది, బీజేపీ నుంచి 27 మంది, కాంగ్రెస్ నుంచి 16 మంది పోటీ చేస్తున్నారు. 57 నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ముగ్గురికంటే ఎక్కువమందిపై కేసులు ఉన్నాయి. 17 శాతం.. అంటే 218 మందిపై చాలా తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. 15 మంది అభ్యర్థులు మహిళలపై అత్యాచారం, వేధింపుల కేసులు ఎదుర్కొంటుండగా నలుగురిపై హత్య కేసులు, 33 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి.
కోటీశ్వరుల్లో సామాన్యుడే టాప్
పంజాబ్ బరిలో నిలిచిన వారిలో 521 మంది (41 శాతం) తమకు రూ. కోటికిపైగా ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు. వీరిలో జాతీయ పార్టీలకు చెందిన 228 మంది, ప్రాంతీయ పార్టీలకు చెందిన 256 మంది, స్వతంత్రులు 447 మంది ఉన్నారు. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 107 మంది కోటీశ్వరులు పోటీ చేస్తుండగా ఆకాలీదళ్ నుంచి 89 మంది, ఆప్ నుంచి 81 మంది, బీజేపీ నుంచి 60 మంది పోటీ చేస్తున్నారు. కాగా సామాన్యుల పార్టీగా చెప్పుకుంటున్న ఆప్ అభ్యర్థి కుశ్వంత్ సింగ్ రూ.238 కోట్ల ఆస్తులతో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. ఆ తర్వాత రూ.202 కోట్ల ఆస్తులతో అకాలీదళ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ రెండో స్థానంలోనూ రూ.155 కోట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ కుమార్ మూడో స్థానంలో ఉన్నారు. కాగా ఐదుగురు అభ్యర్థులు మాత్రం తమకు ఎటువంటి ఆస్తులు లేవని ప్రకటించారు.