iDreamPost
android-app
ios-app

గ్రేట‌ర్ వార్ : 2009 సీన్ రిపీట్..!

గ్రేట‌ర్ వార్ : 2009 సీన్ రిపీట్..!

2016 జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో 99 స్థానాలు సాధించి ఏక‌ఛ‌త్రాదిప‌త్యం సాధించిన టీఆర్ఎస్ 2020 ఎన్నిక‌ల్లో 55 సీట్లు సాధించింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ 48 సీట్లు పొంది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష స్థానం సాధించింది. ఎంఐఎం గ‌త ఎన్నిక‌ల మాదిరిగానే 44 స్థానాల్లో గెలుపొంది త‌మ‌కు తిరుగులేద‌ని నిరూపించుకుంది. కాంగ్రెస్ కూడా 2016 ఎన్నిక‌ల మాదిరిగానే 2 స్థానాల‌తో స‌రిపెట్టుకుంది. ఇదిలా ఉండ‌గా.. మేయ‌ర్ పీఠం పొందేందుకు స్ప‌ష్ట‌మైన మెజారిటీని ఓట‌ర్లు ఏ పార్టీకీ ఇవ్వ‌లేదు. సెంచ‌రీ సాధించి సొంతంగా బ‌ల్దియాను సొంతం చేసుకుంటామ‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు ధీమాను వ్యక్తం చేశాయి. అయితే అందుకు విరుద్ధంగా గ్రేట‌ర్ తీర్పు వెలువ‌డింది. మేయ‌ర్ పీఠం ద‌క్కాలంటే 150 మంది కార్పొరేట‌ర్ల‌తో పాటు 49 మంది ఎక్స్అఫీషియో స‌భ్యులు ఓట్లు వేయాలి. అంటే మొత్తం స‌భ్యుల సంఖ్య 199. మేయ‌ర్ పీఠం ద‌క్కించుకోవాలంటే 100 మంది స‌భ్యులుండాలి. ఫ‌లితాల‌ను బ‌ట్టి చూస్తే ఎక్స్ అఫీషియో క‌లుపుకున్నా ఏ పార్టీకీ ఆ అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలో మేయ‌ర్ కావాలంటే మ‌రో పార్టీ మ‌ద్ద‌తు త‌ప్ప‌దు.

2009లో హంగ్ : అప్పుడేం జ‌రిగిందంటే..

జీహెచ్‌ఎంసీ ఆవిర్భావం తర్వాత 2009లో ఉమ్మడి రాష్ట్రంలో మొదటి, చివరిసారిగా జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉంది. ఆ ఎన్నికల్లో నాటి అధికార కాంగ్రెస్‌ పార్టీ 149 స్థానాల్లో పోటీ చేసి అత్యధికంగా 52 స్థానాలు గెల్చుకుంది. ఆ తర్వాత 45 సీట్లతో టీడీపీ, 43 సీట్లతో ఎంఐఎం రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బీజేపీ ఐదు సీట్లనే గెలుచుకుంది. ఎంబీటీ, పీఆర్పీ నుంచి ఒక్కొక్కరు గెలిస్తే, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు గెలిచారు. 150 వార్డులు గ‌ల కార్పొరేష‌న్ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు ఎవ‌రికీ స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాలేదు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫీషియో స‌భ్యుల‌ను క‌లుపుకున్నా కానీ మేజిక్ ఫిగ‌ర్ రాలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఎంఐఎంతో సంప్ర‌దింపులు జ‌రిపింది. మ‌ద్దతు ఇచ్చేందుకు ఎంఐఎం ష‌ర‌తులు పెట్టింది. కాంగ్రెస్ కు స‌హ‌క‌రించాలంటే మేయ‌ర్ ప‌ద‌వి త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరింది. దీంతో కాంగ్రెస్ పెద్ద‌లు చెరి రెండున్న‌రేళ్లు పంచుకునేలా ఒప్పందానికి వ‌చ్చారు.

దీనిలో భాగంగా తొలి రెండున్న‌రేళ్లు కాంగ్రెస్ మేయ‌ర్ గా బండ కార్తీక‌రెడ్డి కొన‌సాగారు. ఆ త‌ర్వాత రెండున్న‌రేళ్ల పాటు ఎంఐఎం మేయ‌ర్ గా మాజిద్ హుస్సేన్ కొన‌సాగారు. అనంత‌రం రెండేళ్ల ప్ర‌త్యేక అధికారి పాల‌న అనంత‌రం 2016లో జ‌రిగిన కార్పొరేషన్ ఎన్నిక‌లు జ‌రిగాయి. గ్రేటర్‌ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా అప్పటి వరకు 52 డివిజన్లను మించి గెలవలేదు. ఆ సంఖ్య‌ను టీఆర్ఎస్ చెరిపేసింది. 99 స్థానాల్లో విజ‌య దుందుభి మోగించింది. ఏ పార్టీ మ‌ద్ద‌తు లేకుండానే మేయ‌ర్ పీఠం సొంతం చేసుకుంది. ఇప్పుడు మ‌ళ్లీ 2009 సీన్ రిపీట‌వుతోంది. తాజా ఫ‌లితాలలో కూడా ఏ పార్టీకీ స్ప‌ష్ట‌మైన మెజారీ రాలేదు. దీంతో 2020 ఎన్నిక‌ల్లో కూడా ఎంఐఎం కింగ్ మేక‌ర్ కానుంది. డిప్యూటీ మేయ‌ర్ అడిగితే ప‌ర్వాలేదు. కానీ.. మేయ‌ర్ పీఠంలో భాగం అడిగితే..? టీఆర్ఎస్ ఏం చేస్తుందో చూడాలి.