ప్రజల అవసరాలకు తగ్గట్లు టెక్నాలజీలో వేగంగా మార్పులు వస్తున్నాయి. అదే టైమ్‌లో అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, వాడుకోవడంలో అందరూ ముందుంటున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగినప్పటి నుంచి సాంకేతిక రంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ప్రతి దానికి ఇప్పుడు యాప్స్ వచ్చేశాయి. ఈ క్రమంలో వచ్చినవే యూపీఐ యాప్స్. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీ షాప్‌కు వెళ్లినా, పెద్ద రెస్టారెంట్‌కు వెళ్లినా డబ్బులు చెల్లించాలంటే జస్క్ ఫోన్లో ఈ యాప్స్ తెరిచి స్కాన్ చేస్తే చాలు. కరోనా టైమ్‌లో క్యాష్‌లెస్ పేమెంట్స్ కోసం యూపీఐ యాప్స్ వాడకం బాగా పెరిగింది.
సోషల్ డిస్టెన్సింగ్ తదితర నిబంధనలు ఉండటం, ముట్టుకుంటే కరోనా సోకుతుందనే భయంతో అందరూ ఈ యాప్స్ ద్వారా చెల్లింపులు చేసేవారు. ఇప్పుడు అది పీక్కు చేరుకుంది. అయితే అప్పట్లో ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్ ద్వారానే చెల్లింపులు చేసేందుకు వీలుండేది. బ్యాంకులకు సంబంధించిన యాప్స్ ద్వారా చెల్లింపులు చేసుకునేందుకు ఛాన్స్ ఉన్నా.. అది ఆ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే వీలుండేది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. డిజిటల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ను మరింత ఎక్కువ మందికి చేరవేసేందుకు ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ పేమెంట్స్ కోసం ఇకపై యోనో యాప్‌ను ఏ బ్యాంక్ కస్టమర్ అయినా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.
ఇకపై ఎస్బీఐ అకౌంట్ లేకపోయినా యోనో మొబైల్ యాప్ ద్వారా డబ్బులు పంపడం లేదా అందుకోవడం చేసుకోవచ్చు. ఏ బ్యాంక్ కస్టమర్ అయినా యోనో యూపీఐ ఫీచర్ యాక్సెస్ చేసి.. స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ లాంటి వాటితో పేమెంట్స్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యోనో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. యూపీఐ సర్వీస్‌తో పాటు కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సదుపాయాన్నీ ఎస్బీఐ కల్పిస్తోంది. ఏ బ్యాంక్ కస్టమరైనా ఐసీసీడబ్ల్యూ సౌకర్యం ఉన్న ఏటీఎంల్లో ఎస్బీఐ యోనో యాప్‌లోని ‘యూపీఐ క్యూఆర్ క్యాష్’ ఆప్షన్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఎస్బీఐ యోనో యాప్.. ఇప్పుడున్న ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్‌కు గట్టిపోటీనిచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.