iDreamPost
android-app
ios-app

ఆగస్టు 15కు జెండా ఆవిష్కరణ ఎర్రకోట మీదే ఎందుకు చేస్తారంటే?

Independence Day 2024- Why National Flag Hoisted On Red Fort: పంద్రాగస్టున దేశ ప్రధాని ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఎర్రకోట మీదే ఎందుకు ఎగురవేస్తారు అనే విషయం మీకు తెలుసా?

Independence Day 2024- Why National Flag Hoisted On Red Fort: పంద్రాగస్టున దేశ ప్రధాని ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఎర్రకోట మీదే ఎందుకు ఎగురవేస్తారు అనే విషయం మీకు తెలుసా?

ఆగస్టు 15కు జెండా ఆవిష్కరణ ఎర్రకోట మీదే ఎందుకు చేస్తారంటే?

ఢిల్లీలోని ఎర్రకోట 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ జెండాను ఆవిష్కరించి.. జాతిని ఉద్దేశేంచి ప్రసంగించనున్నారు. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి మొత్తం 6 వేల మంది అతిథిలు హాజరవుతున్నారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత బృందాలకు ఆహ్వానాలు అందాయి. అంతేకాకుండా.. ప్రభుత్వ పథకాలు పొందిన వారిలో కొందరు, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిని కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. సాయుధ దళాల ప్రత్యేక కవాతు కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రతి ఆగస్టు 15కు ఎర్రకోట మీద జెండాను ఆవిష్కరిస్తారు. అయితే అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా?

అందరికీ ఆగస్టు 15న ఎర్రకోట మీద జెండాను ప్రధాని ఆవిష్కరిస్తారని తెలుసు. కానీ, అక్కడే ఎందుకు జెండాను ఎగురవేస్తారు అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. 1947 ఆగస్టు 15న భారతదేశ తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగురవేసి.. జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత అదే ఆనవాయితీగా మారిపోయింది. తర్వాత వచ్చిన ప్రధానులు కూడా ప్రతి ఆగస్టు 15కు ఎర్రకోట మీదే జాతీయ జెండాను ఎగురవేస్తూ వచ్చారు. జాతినుద్దేసించి ప్రసంగించేవారు. అయితే ఈ ఒక్క కారణం మాత్రమే కాకుండా.. ఎర్రకోట మీద పంద్రాగస్టున జాతీయ జెండాను ఎగుర వేయడం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎర్రకోటకు ఉన్న చరిత్రను కూడా ఒక కారణంగా చెప్పచ్చు.

చరిత్ర:

ఎర్రకోట భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. 1857 వరకు ఎర్రకోట మొఘల్ చక్రవర్తులకు ప్రధాన నివాసంగా ఉంది. సిపాయి తిరుగుబాటులో కూడా ఎర్రకోటకు ప్రాముఖ్యత ఉంది. ఆఖరి మొఘల్ చక్రవర్తి బహద్దూర్ షా జాఫర్ తో కలిసి ఎర్రకోట కేంద్రంగా బ్రిటిష్ వారితో పోరాటాలు చేశారు. 1857, సెప్టెంబర్ లో బ్రిటిష్ సైన్యం ఎర్రకోటను ఆక్రమించింది. మొఘల్ చక్రవర్తుల పాలన ఎర్రకోట వేదికగా ముగిసిపోయింది. ఇలాంటి ప్రాంతంలో జెండాను ఎగురవేయడం ద్వారా బ్రిటీష్ పాలన నుంచి మనల్ని మనం విముక్తులను చేసుకోవడం, మన స్వాతంత్య్రాన్ని మనం తిరిగి పొందిన విషయాన్ని బలంగా చెప్పినట్లు అవుతుందని అలా కొనసాగిస్తున్నారు. ఎర్రకోట మన స్వాతంత్ర్య, సార్వభౌమాధికారాలకు శాశ్వతమైన స్ఫూర్తి చిహ్నంగా నిలుస్తుంది.

ఎర్రకోట భారతదేశ వారసత్వానికి ప్రతీక కూడా. అంతేకాకుండా సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఇక్కడ ప్రధాని జాతీయ జెండాను ఎగురవేయడం వల్ల మనకు లభించిన స్వేచ్ఛ, సార్వభౌమాధికారాన్ని మరోసారి నొక్కి చెప్పినట్లు కూడా అవుతుందని భావిస్తారు. జాతీయ జెండాను ఎగురవేయడం, ప్రధాని ప్రసంగించడమే కాకుండా.. పంద్రాగస్టు వేడుకల్లో సాంస్కృతి కార్యక్రమాలకు కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. త్రివిధ దళాల కవాతులు, ప్రదర్శనలు ఉంటాయి. పలు సాంస్కృతిక, దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన స్వేచ్ఛ, మన ఐక్యతను మరోసారి చాటి చెబుతూ అంతా ఒక్కటై ఈ స్వాతంత్య్ర దినోత్స వేడుకలను ఎర్రకోట వేదికగా నిర్వహిస్తారు.