P Venkatesh
P Venkatesh
ట్రాఫిక్ రూల్స్ కు విరుద్దంగా వాహనాలను నడిపినప్పుడు అధికారులు చలానాలు విధించడం సాధారణంగా జరిగే విషయమే. హెల్మెట్ లేకుండా ప్రయాణించినపుడు, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా ఇతర కారణాలతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తారు. అయితే ఈ చలాన్లను కొంతమంది వాహనదారులు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటారు. మరికొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరించి తడిసి మోపెడయ్యేదాక తెచ్చుకుంటారు. ఏదో ఓ రోజు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడి చేతి చమురు వదిలించుకుంటారు. ఈ క్రమంలో వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మీ వాహనాలపై ఉన్న చలాన్లను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు లోక్ అదాలత్ నిర్వహించి 1.70 లక్షల కేసులు క్లియర్ చేయనున్నారు. ఇంతకీ ఇది ఎక్కడంటే?
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు పడినటువంటి వాహనదారుల కేసులు పరిష్కరించేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అక్టోబర్ 8 వ తేదీన జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు ఏకంగా లోక్ అదాలత్‌నే నిర్వహిస్తున్నారు అధికారులు. వాహనదారులు తమ వాహనాలపై పడిన చలాన్లను ఈ లోక్ అదాలత్‌లో క్లియర్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో వాహనాలపై ఉన్న చలాన్ల రకాన్ని పరిశీలించి వాటిని రద్దు చేయడమో లేదా తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతో ఆదివారం రోజు 1.7 లక్షల చలాన్లను పరిష్కరించాలని నిర్ణయించారు. 2023 జూన్ 30 వ తేదీ లోపు నమోదైన చలాన్లను మాత్రమే ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.