నల్లగా ఉన్నావ్‌ అంటూ భర్తకు వేధింపులు.. కోర్టు సంచలన తీర్పు!

ప్రేమ పెళ్లి కావచ్చు.. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావచ్చు.. భార్యా, భర్తల మధ్య గొడవలు జరగటం.. మళ్లీ కలిసిపోవటం సాధారణంగా జరిగే తంతే. అయితే, గొడవల తీవ్రత పెరిగే కొద్ది విడిపోవాలన్న ఆలోచన ఎవరో ఒకరిలో మొదలవుతుంది. కలిసి ఉండలేనపుడు విడాకులు తీసుకుని విడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే, విడాకులు ఇవ్వటానికి కోర్టు అన్ని రకాలుగా విచారణ జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని సార్లు మనకు వింతగా అనిపించే కారణాలకు కూడా కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.

తాజాగా, కర్ణాటక కోర్టు ఓ సంచలన తీర్పు నిచ్చింది. నల్లగా ఉన్నాడంటూ భర్తను వేధిస్తున్న భార్యకు కోర్టు షాకిచ్చింది. మానసిక వేధింపుల ప్రాతిపదికన కోర్టు విడాకులు ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ జంటకు 2007లో పెళ్లయింది. వీరికి కొన్నేళ్ల తర్వాత ఓ పాప పుట్టింది. ఈ నేపథ్యంలోనే 2012లో భర్త బెంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. భార్య తనను మానసికంగా వేధిస్తోందని, విడాకులు కావాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలోనే భార్య కూడా భర్తపై కౌంటర్‌ కేసు వేసింది.

తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని పేర్కొంది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని తెలిపింది. దీంతో ఫ్యామిలీ కోర్టు భర్త విడాకుల విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే భర్త హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టులో ఓ కేసు వేశాడు. భార్య తనను ‘నల్లగా ఉన్నావు’ అంటూ తరచుగా వేధిస్తోందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. భార్య కుటుంబం కూడా తనను మానసికంగా హింసిస్తోందని తెలిపాడు. తాజాగా విచారణ జరిపిన కోర్టు భార్య తీరుపై మండిపడింది. నల్లగా ఉన్నావంటూ భర్తను వేధించటం కూడా క్రూరత్వమే అని స్పష్టం చేసింది. భర్తకు సానుకూలంగా తీర్పును ఇచ్చింది. విడాకులు మంజూరు చేస్తూ తుది తీర్పును వెల్లడించింది.

Show comments