iDreamPost
android-app
ios-app

చంద్రయాన్ 3 కంప్లీట్ జర్నీ..! 40 రోజుల్లో కీలక ఘట్టాలు ఇవే!

చంద్రయాన్ 3 కంప్లీట్ జర్నీ..! 40 రోజుల్లో కీలక ఘట్టాలు ఇవే!

ఇది యావత్ భారతావనికి ఎంతో ఉద్విగ్న క్షణం. చంద్రయాన్ 3 ప్రయోగం విజవంతం కావడంతో 132 కోట్ల మంది భారతీయులు ఈ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ప్రపంచదేశాలు అన్నీ భారత్, ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెబుతున్నాయి. ఇప్పుడు అందరిచూపు భారతదేశంపైనే ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజవంతంగా జెండా ఎగరేసిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. అసలు ఈ ప్రయోగం మొదలైనప్పటి నుంచి విజయం సాధించిన వరకు ఏ దశలో ఏం జరిగింది? చంద్రయాన్ 3 ప్రయోగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే అన్ని విషయాలను తెలుసుకుందాం.

చంద్రయాన్ 3 ప్రయోగం:

చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రయాన్ 2 ప్రయోగం నుంచి నేర్చుకున్న పాఠాలతో మరింత జాగ్రత్తగా ఈ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టింది. అమెరికా, చైనా, రష్యాలకు భిన్నంగా భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది. జులై 14 శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం కోసం ఇస్రో బాహుబలి రాకెట్ ఎల్వీఎం-3ని ఎంచుకున్నప్పుడే ఈ ప్రయోగం సగం సక్సెస్ అయినట్లు అంతా భావించారు. ఇస్రో డెవలప్ చేసిన లాంఛ్ వెహికిల్స్ లో ఎల్వీఎం-3 ఎంతో పవర్ ఫుల్. ఎంతో బరువును సునాయాసంగా తీసుకెళ్లగలదు.

ఈ ప్రయోగంలో రెండు ఘన ఇంధన,  ఒక ధ్రవ ఇంధన బూస్టర్లను వాడారు. ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు 2 ఘన ఇంధన బూస్టర్లను వాడారు. ఆ తర్వాత రాకెట్ చంద్రుడి కక్షలోకి ప్రవేశించేందుకు ధ్రవ ఇంధన బూస్టర్ దోహదపడింది. పేలోడ్ ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు అవసరమైన శక్తికోసం భారత్ లో తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ సీఈ-20ని వినియోగించారు. ఈ రాకెట్ బరువు 640 టన్నులు,  పొడవు 43.5 మీటర్లు,  4,000 కిలోల వరకు పేలోడ్ ను జీటీవో వరకు మోసుకెళ్లగలదు. ఇప్పటి వరకు ఈ రాకెట్ ద్వారా 3  ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ రాకెట్ ను మొదట జీఎస్ఎల్వీ- ఎంకే3గా పిలిచేవారు. తర్వాత దీనికి ఇస్రో ఎల్వీఎం-3గా నామకరణం చేసింది.

ప్రయోగం నుంచి ల్యాండింగ్ వరకు:

జులై 14న శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించారు. జులై 15న విజయంతంగా కక్ష పెంపు జరిగింది. జులై 17న చంద్రయాన్ 3 రెండో కక్ష పెంపు ప్రక్రియ విజయవంతమైంది. జులై 18న మూడో కక్ష కూడా పెంపు సఫలీకృతమైంది. ఆ తర్వాత జులై 20న నాలుగో కక్ష, జులై 25న ఐదో కక్ష పెంపు ప్రక్రియ కూడా విజయవంతం అయింది. ఆగస్టు 1 చంద్రయాన్ 3 ప్రయోగం ట్రాన్స్ లూనర్ కక్షలోకి ప్రవేశించింది. ఆగస్టు 5న ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం విజయంతంగా చంద్రుడి కక్ష్య లోకి ప్రవేశించింది. ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయంతంగా విడిపోయింది. విక్రమ్ ల్యాండర్ సొంతంగా తిరుగడం ప్రారంభించింది. ఆగస్టు 21 ప్రయోగంలో డీ బూస్టింగ్ ప్రక్రియ విజయవంతమైంది.

ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయింది. సరిగ్గా నాలుగు గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపైకి అడుగుపెట్టింది. ఈ మొత్తం ప్రక్రియకు ఇస్రో 40 రోజుల సమయం తీసుకుంది. విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ 14 రోజుల పాటు చంద్రుడిపైనే ఉండి పరిశోధనలు చేయనున్నాయి. అయితే 14 రోజులు ఎందుకు అనే అనుమానం రావచ్చు. చంద్రుడి మీద ఒక రోజు అంటే.. భూమి మీద 28 రోజులు అనమాట. చంద్రుడిపై సూర్యరశ్మి పడే పగటి సమయం భూమిమీద 14 రోజులతో సమానం. ప్రగ్యాన్ రోవర్ కు సూర్యరశ్మి తగిలిన ఆ 14 రోజులు అవి పరిశోధనలు చేస్తాయి. రోవర్ లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రోక్ డౌన్ స్ప్రెక్టోస్కోప్(LIBS), అల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్(APXS) అనే రెండు కీలక పరికరాలు ఉన్నాయి.

వీటి సాయంతో ఇస్రో పరిశోధనలు చేయనుంది. LIBS ద్వారా చంద్రుడిపై మెగ్నీషియం, అల్యూమీనియం, సిలికాన్, టైటానియం, ఫెర్రం వంటి మూలకాల ఉనికిని గుర్తిస్తారు. ఏపీఎక్స్ఎస్ ద్వారా చంద్రుడి ఉపరితమంపై ఉన్న మట్టి, రాళ్లలో ఉండే రసాయన సమ్మేళనాలను గుర్తించనున్నారు. ఇవి తెలుసుకోవడం అనేది భవిష్యత్ లో చేయబోయే మరిన్ని ప్రయోగాలకు ఈ సమాచారం కీలకంగా మారనుంది. అలాగే చంద్రుడిపై మనిషి ఉనికి సాధ్యమేనా అనే ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు దోహదపడుతుంది. ఇస్రో నెక్ట్స్  సూర్యూడిని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఆదిత్య ఎల్-1తో సెప్టెంబర్ లో సూర్యూడి మీదకు ఇస్రో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. చంద్రయాన్ 3 సక్సెస్ తో ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేయనున్నారు.