నా సినిమాకు డబ్బులు ఇచ్చి మరీ ఫ్లాప్ టాక్ తెప్పిస్తున్నారు: విజయ్ దేవరకొండ!

  • Author singhj Updated - 01:08 PM, Tue - 5 September 23
  • Author singhj Updated - 01:08 PM, Tue - 5 September 23
నా సినిమాకు డబ్బులు ఇచ్చి మరీ ఫ్లాప్ టాక్ తెప్పిస్తున్నారు: విజయ్ దేవరకొండ!

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఖుషి’ మూవీ పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోంది. ‘లైగర్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్​కు ‘ఖుషి’ చిత్రంతో మంచి ఊరట లభించిందనే చెప్పాలి. ఈ సినిమా విడుదలైన మూడ్రోజుల్లో రూ.70 కోట్లు రాబట్టి బాక్సాఫీస్​ను షేక్ చేసింది. వీక్ డేస్​లోనూ కలెక్షన్స్​లో అదే జోరు ప్రదర్శిస్తే సినిమాతో బిజినెస్​లో ఉన్నవారు మరిన్ని లాభాలు తీసుకునే ఛాన్స్ ఉంది.

‘ఖుషి’ మూవీకి మంచి మౌత్ టాక్, పాజిటివ్ రివ్యూలు రావడం కూడా కలెక్షన్లు ఈ రేంజ్​లో రావడానికి దోహదపడిందని చెప్పొచ్చు. దీంతో ఫుల్​ జోష్​లో ఉన్న మూవీ టీమ్ సక్సెస్​ మీట్​ను విశాఖపట్నంలో నిర్వహించారు. అక్కడ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తనపై, ‘ఖుషి’ సినిమా మీద సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయని విజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కొందరు డబ్బులు ఇచ్చి మరీ మూవీకి ఫ్లాప్ టాక్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విజయ్ అన్నారు.

‘ఖుషి’ సినిమా మీద దాడుల్లో భాగంగానే ఎన్నో ఫేక్ రేటింగ్స్ వచ్చాయన్నారు విజయ్ దేవరకొండ. తన సినిమాలు ఆడకుండా కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా యూట్యూబ్​లో చాలా ఫేక్ రివ్యూలను దాటుకొని ‘ఖుషి’ సక్సెస్​ఫుల్​గా రన్ అవుతోందన్నారు రౌడీస్టార్. అయితే తన అభిమానులు ఇచ్చే ప్రేమ, ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు వాటి గురించి చర్చించి నిరుత్సాహపర్చడం ఇష్టం లేదన్నారు. వాటి సంగతి తర్వాత చూసుకుందామన్నారు. ‘ఖుషి’ సినిమాతో ఫ్యాన్స్ ముఖాల్లో నవ్వులు చూడాలనే తన కోరిక తీరిందన్నారు. ఇప్పుడు తాను ఫుల్ హ్యాపీగా ఉన్నానని విజయ్ చెప్పుకొచ్చారు.

‘ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. డబ్బులు బాగా సంపాదించాలి. అమ్మానాన్నలను హ్యాపీగా ఉంచాలి. అలాగే సమాజంలో గౌరవం కావాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొనే నేనెప్పుడూ పనిచేస్తుంటాను. కానీ ఇప్పుడు కొన్ని డెసిజన్స్ మార్చుకుంటున్నాను. మీ కోసం పనిచేయాలని అనుకుంటున్నాను. నాతో పాటు మీరంతా ఆనందంగా ఉండాలి. అందుకే 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి, నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో కుటుంబానికి రూ.లక్ష) పది రోజుల్లో అందజేస్తాను. ఇక నుంచి మనందరం దేవర ఫ్యామిలీ’ అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు.


ఇదీ చదవండి: ‘సలార్’ రావట్లేదని.. ముందస్తుగా ‘టైగర్ నాగేశ్వరరావు’!

Show comments