రౌడీస్టార్ విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన నటంచిన గత చిత్రం ‘లైగర్’ భారీ అంచనాల నడుమ రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలో ‘ఖుషి’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ సమంత నటించారు. సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
‘ఖుషి’ నుంచి ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేసింది. సినిమా మీద అంచనాలను మరింత పెంచేందుకు ప్రమోషన్స్‌లో జోరు పెంచారు విజయ్ దేవరకొండ. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ పోతున్నారు రౌడీస్టార్. ఈ క్రమంలో ఆయన తన కెరీర్‌తో పాటు పెళ్లి గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమన్నారు విజయ్. నటనకు కొన్నాళ్లు విరామం ఇచ్చి ఏదైనా సినిమా తీయాలని ఉందన్నారు. తనకు ఆర్కిటెక్చర్ అంటే ఇష్టమన్నారు. హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’ అంటే తనకు చాలా ఇష్టమన్నారు రౌడీస్టార్.
తెలుగులో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ‘పోకిరి’ సినిమా తనపై చాలా ప్రభావం చూపిందన్నారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో మహేష్ ఇంట్రడక్షన్ సీన్ చూసి తాను నటుడ్ని అవ్వాలని ఫిక్స్ అయ్యానన్నారు. ప్రతి ఒక్కరికీ ఫెయిల్యూర్ వస్తుందని.. దాని నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందడుగు వేస్తే టార్గెట్‌ను చేరుకోవచ్చన్నారు రౌడీస్టార్. పెళ్లి గురించి ఆయన మాట్లాడుతూ.. ‘నా జీవిత భాగస్వామి ఇంటెలిజెంట్ అయి ఉండాలి. నేను ఇష్టపడే వాటిని తనూ ఇష్టపడాలి. నాకు చేసుకోవాలని అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటా. అయితే చాలా సింపుల్‌గా చేసుకోవాలని అనుకుంటున్నా. అందుకే చేసుకునే టైమ్‌లో ఎవరికీ చెప్పను’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.