బంగారం ప్రవహించే నది.. మన దేశంలోనే.. ఎక్కడంటే!

బంగారం అంటే భారతీయులకు.. మరీ ముఖ్యంగా మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగలు, ప్రత్యేక పర్వదినాలు, శుభకార్యాల వేళ.. కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తారు. బంగారం అంటే కేవలం ఓ లోహం మాత్రమే కాదు.. సాక్షాత్తు లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. పసిడి ధర ప్రతి రోజు పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు. సామాన్యులు, మధ్యతరగతి వారు బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి. భారతీయలుకు బంగారం అంటే ఎంత మోజు అంటే.. ప్రపంచంలో బంగారం దిగుమతిలో ఇండియానే ప్రథమ స్థానంలో ఉంటుంది. కారణం మన దగ్గర బంగారం లభ్యత చాలా తక్కువ. అందుకే మనం విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మరి మన దగ్గర బంగారు గనులు లేకపోవచ్చు.. కానీ మన దేశంలోని ఓ నదిలో ఏకంగా బంగారం ప్రవహిస్తోంది అని మీకు తెలుసా.. మరి ఇంతకు ఆ నది ఏది.. ఎక్కడ ఉంది అంటే..

నదిలో బంగారం ప్రవహించడం ఏంటి అనుకుంటున్నారా.. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. మన దేశంలో ప్రవహించే బంగారు నదిని స్వర్ణరేఖ నది అని పిలుస్తారు. దీనిని బెంగాల్‌లో సుబర్ణరేఖ నది అని కూడా అంటారు. ఈ నది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. ఈ నది జార్ఖండ్‌లోని రత్నగర్భ అనే ప్రదేశంలో ప్రవహిస్తుంది. చాలా ఏళ్లుగా ప్రజలు ఈ నది ఇసుక నుంచి బంగారం వెలికి తీస్తున్నారు. ఇది రాంచీకి నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్డి గ్రామానికి చెందిన రాణి చువాన్ అనే ప్రాంతంలో జన్మించింది.

గోల్డెన్ లైన్, దాని ఉపనది కోర్కెరీ ఇసుకలో బంగారు రేణువులు కనిపిస్తాయి. అలానే కోర్కెరీ నది నుండి బంగారు రేణువులు ప్రవహించి బంగారు రేఖను ఏర్పరుస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ నది జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బాలాసోర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. సుబర్ణరేఖ నది పొడవు 474 కిలోమీటర్లు. కోర్కెరీ నది పొడవు 37 కిలోమీటర్లు. ఇది చాలా చిన్నది. అయితే ఈ రెండు నదుల్లోని ఇసుకలో బంగారు రేణువులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న మిస్టరీని ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇప్పటికి ఇది అంతుచిక్కని మిస్టరీగానే ఉంది.

జార్ఖండ్‌లో నది చుట్టుపక్కల ఉండే స్థానిక నివాసితులు తమర్, సరంద వంటి ప్రదేశాలలో నదిలో ఇసుకను ఫిల్టర్ చేసి బంగారు రేణువులను సేకరిస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి నెలకు 60 నుంచి 80 బంగారు రేణువులను నది నుంచి సేకరిస్తారు. ఈ బంగారు రేణువుల పరిమాణం బియ్యం గింజ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఉండే గిరిజనులు ఒక్క వర్షాకాలం తప్ప మిగతా సమయం అంతా ఇక్కడ బంగారు రేణువులను వెలికితీసే పనిలోనే ఉంటారు. ఇది మన దేశంలో బంగారం ప్రవహించే నది విశేషాలు.

Show comments