సెలబ్రిటీలు అందులోనూ సినీ తారలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. వాళ్లు ఏదైనా పబ్లిక్ ఈవెంట్స్ లేదా సినిమా ఫంక్షన్స్‌కు వచ్చినప్పుడు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అభిమానుల నుంచి, కొంతమంది ఆకతాయిల నుంచి సమస్యలు తలెత్తడం గురించి వింటూనే ఉంటాం. అయితే ఇలాంటి సమయంలో వాళ్లకు పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అంతగా ప్రాబ్లమ్ ఉండదు. కానీ భద్రత లేకపోతే మాత్రం సదరు సెలబ్రిటీలకు సమస్యలు తప్పవు. ఇటీవల స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ను ఓ ఆగంతకుడు వెంటపడి వేధించడం గురించి వార్తల్లో వచ్చింది.
ఎందుకు వెంట పడుతున్నావ్ అంటూ శ్రుతి హాసన్ వారించినా ఆగంతకుడు వినిపించుకోలేదు. శ్రుతిని ఓ వ్యక్తి వెంబడించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. విమానాశ్రయంలో ఓ ఆగంతకుడు తన వెనుక పడటంతో ఆందోళన చెందారీ అమ్మడు. ఎందుకు వెంబడిస్తున్నావని వారించినా.. అతడు ఏమాత్రం పట్టించుకోకుండా వేధించసాగాడు. దీంతో శ్రుతి హాసన్ అక్కడి నుంచి వేగంగా వెళ్లేందుకు తన కారు దగ్గరకు వెళ్లారు. అయినా అతడే అలాగే వెంబడించాడు. దీంతో ‘నువ్వు ఎవరో నాకు తెలీదు. ఎందుకు వెంటపడుతున్నావ్’ అంటూ అతడిపై శ్రుతి సీరియస్ అవ్వడంతో అతడు అక్కడి నుంచి జారుకున్నాడు.
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన చేదు అనుభవంపై శ్రుతి హాసన్ స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ చిట్‌చాట్‌లో భాగంగా ఆమె ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. తనను వెంబడించిన ఆ వ్యక్తి ఎవరో తెలియదన్నారు. అతడు ఫొటో కోసం తన వద్దకు వచ్చాడేమోనని అనుకున్నానని చెప్పారు. అతడు తనకు చాలా దగ్గరగా రావడంతో అసౌకర్యంగా అనిపించిందని.. అందుకే వేగంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయానని తెలిపారు శ్రుతి. పర్సనల్ బాడీగార్డ్‌లను పెట్టుకోవడం తనకు ఇష్టం లేదని.. తన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఈ విషయం మీద ఆలోచించాలేమోనని శ్రుతి హాసన్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ‘కల్కి’ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్!