వడివేలు.. తమిళ చిత్రసీమలో కమెడియన్‌గా ఎంతో పేరు గడించిన వారిలో ఒకరు. ఒక సమయంలో ఆయన లేని తమిళ సినిమా లేదు అనే రేంజ్లో ఉండేది. యువ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి మూవీస్‌లో వడివేలు ఉండాల్సిందే. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అంతగా ఆడియెన్స్‌ను ఆయన ఉర్రూతలూగించారు. తలైవా రజినీకాంత్ ‘చంద్రముఖి’ సినిమాతో తెలుగు నాట కూడా వడివేలుకు పాపులారిటీ పెరిగింది. అలాంటి ఆయన కొన్ని వివాదాల కారణంగా చాన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యారు. రీఎంట్రీలో ‘మామన్నన్’తో బిగ్ హిట్ కొట్టారాయన.
ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ‘మామన్నన్’లో ఫెంటాస్టిక్ యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు వడివేలు. అలాంటి ఆయనపై గతంలో పలువురు నటులు, నటీమణులు ఆరోపణలు చేశారు. తాజాగా ప్రముఖ నటి షకీలా కూడా ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగానే ఆయన గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం సినీ స్టార్స్‌ను ఆమె ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళ నటి ప్రేమ ప్రియను కూడా షకీలా ఇంటర్వ్యూ చేశారు. కెరీర్ ప్రారంభంలో వడివేలుతో పాటు వివేక్, సంతానం లాంటి హాస్య నటుల పక్కన చిన్న చిన్న పాత్రల్లో నటించారు ప్రేమ ప్రియ. అయితే ఆ తర్వాత ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి.
చిత్ర పరిశ్రమలో తన ఎదుగుదలకు వడివేలు అడ్డుకట్ట వేశారని షకీలాతో ఇంటర్వ్యూలో ప్రేమ ప్రియ ఆరోపించారు. తనకు మూవీస్‌లో యాక్టింగ్ చేసే ఛాన్సులు వచ్చాయని.. అయితే ఆయన వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయన్నారు. షూటింగ్‌కు వెళ్తే తనను చూడగానే ఈ అమ్మాయి వద్దని వడివేలు మూవీ మేకర్స్‌తో చెప్పించి వెనక్కి పంపేవారని ప్రేమ ప్రియ తెలిపారు. వడివేలుకు తనకు మధ్య మీ-టూ సమస్య లేదని.. అది వేరే సమస్య అన్నారామె. అయితే తనకు వడివేలు గురించి బాగా తెలుసని షకీలా చెప్పుకొచ్చారు. షూటింగ్ స్పాట్లో ఆయన ఎలా ఉంటాడో, ఏం అడుగుతాడో తెలుసునని ఆ ఇంటర్వ్యూలో షకీలా పేర్కొన్నారు. వడివేలు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.