Pawan Kalyan : అంతుచిక్కని పవన్ రీమేక్ ప్లాన్స్

భీమ్లా నాయక్ హిట్ ఇచ్చిన కిక్కో లేక రిస్క్ ఎందుకులే అనే ధోరణో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ రీమేకుల ప్రహసనం మాత్రం ఆగేలా కనిపించడం లేదు. అజ్ఞాతవాసి తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకుని చేసిన రెండు సినిమాలు ఇదే కోవలోకి రాగా తాజాగా మరో రెండు క్యూలో నిలబడుతున్నాయి. అందులో మొదటిది వినోదయ సితం. సముతిర ఖని ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ థ్రిల్లర్ ని తెలుగులో పవన్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ తో త్రివిక్రమ్ రచనలో తీయడానికి మూడు నిర్మాణ సంస్థలు రంగం సిద్ధం చేసుకున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చిందని త్వరలోనే నిర్మాణం ప్రారంభమవుతుందని అంటున్నారు.

ఇందుకుగాను పవర్ స్టార్ ఇస్తున్న కాల్ షీట్స్ కేవలం ఇరవై రోజులేనని వినికిడి. ఇందుకుగాను అక్షరాల యాభై కోట్ల పారితోషికం అందుకోబోతున్నారని సమాచారం. ఇది మాములు జాక్ పాట్ కాదు. వినోదయ సితం రెగ్యులర్ కమర్షియల్ డ్రామా కాదు. అయినా కూడా మన తెలుగు ఆడియన్స్ టేస్ట్, అభిమానుల అంచనాలకు తగ్గట్టు కొన్ని కీలక మార్పులతో రెడీ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హరిహర వీర మల్లు, భవదీయడు భగత్ సింగ్ లు ఈ కారణంగానే కొంత బ్రేక్ వేసుకోక తప్పలేదని ఫిలిం నగర్ టాక్. అంటే వీటికన్నా ముందే వినోదయ సితం(తెలుగు టైటిల్ ఫిక్స్ చేయలేదు) వచ్చే ఛాన్స్ లేకపోలేదు.

దీని సంగతలా ఉంచితే విజయ్ తేరి రీమేక్ ని సుజిత్ డైరెక్షన్లో ప్లాన్ చేసినట్టు తిరుగుతున్న వార్తలు ఫాన్స్ లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఆల్రెడీ దీని డబ్బింగ్ వెర్షన్ శాటిలైట్ ఛానల్స్ లో చాలా సార్లు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. మనమే ఎన్నో సార్లు చూసిన రొటీన్ పోలీస్ యాక్షన్ డ్రామా ఇది. దీన్నే ఏరికోరి తీయడమెందుకు అంతుచిక్కని విషయం. ఈ రెండు ప్రాజెక్టులు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ నిప్పు లేనిదే పొగ రాదుగా. వచ్చే ఎన్నికల లోగా అసలు పవన్ ఎన్ని సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడో అంతు చిక్కని భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. రీమేకులు చాలులెమ్మని అడుగుతున్న ఫ్యాన్స్ లేకపోలేదు

Also Read : Dubbing Movies : అరవ సినిమాల క్రేజు మోజు తగ్గిపోయింది

Show comments