Kinnerasani – Zee5 కిన్నెరసాని రిపోర్ట్

2018లో మెగాస్టార్ చిన్నల్లుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ గుర్తున్నాడుగా. డెబ్యూ మూవీకి మావయ్య టైటిల్ విజేతను వాడుకున్నా లాభం లేకపోయింది. రెండోది సూపర్ మచ్చి మరీ దారుణం. ఏళ్ళ తరబడి నిర్మాణం చేసుకుని మొన్నెప్పుడో జనవరిలో రిలీజైతే పట్టుమని రెండు రోజులు ఆడటం కూడా కష్టమనేంత స్థాయిలో డిజాస్టర్ అయ్యింది. మూడోది కిన్నెరసాని. అదిగో ఇదిగో అంటూ దీని రిలీజ్ ని సైతం నానుస్తూ వచ్చారు. మెగా ఫ్యామిలీతో సంబంధాలు కట్ అయ్యాయనే వార్తల నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ బయట కనిపించడం లేదు. అదే కారణమో ఏమో చెప్పలేం కానీ కిన్నెరసాని ఫైనల్ గా జీ5లో ఓటిటి రూటు తీసుకుంది. రిపోర్ట్ చూద్దాం.

జమీందారు వంశానికి చెందిన వేదా(ఆన్ శీతల్)చిన్నప్పుడు తన తల్లికి చావుకు కారణమై జైలు నుంచి తప్పించుకుని కనిపించకుండా పోయిన తండ్రి(రవీంద్ర విజయ్)ని వెతుకుతూ ఉంటుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ లాయర్ గా పనిచేస్తున్న విక్రమ్(కళ్యాణ్ దేవ్) ఈ విషయంలో సహాయం చేస్తూ ఉంటాడు. ఈలోగా నగరంలో వేదా పేరుతో ఉన్న అమ్మాయిలు ఒక్కొక్కరుగా అత్యంత దారుణంగా హత్య చేయబడతారు. ఒకదశలో వీటి వెనుక విక్రమ్ ఉన్నాడన్న అనుమానం వేదాతో పాటు పోలీసుల్లోనూ కలుగుతుంది. ఇంతకీ వేదా నాన్న ఏమయ్యాడు, కిన్నెరసాని పేరు వెనుక ఉన్న చిక్కుముడి ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే చూడాలి.

ఇది రెగ్యులర్ గా సాగే సైకో పాత్ కథే. ఫస్ట్ హాఫ్ లో కొన్ని మలుపులు ఆసక్తి రేపినప్పటికీ నీరసంగా సాగే కథనం, రొటీన్ ఫ్లాష్ బ్యాక్, బ్యాడ్ స్క్రీన్ ప్లే వల్ల ఆసక్తికరంగా సాగడంలో విఫలమయ్యింది. అశ్వద్ధామ దర్శకుడు రమణ తేజ గ్రిప్పింగ్ గా నడపలేకపోయారు. దానికి తోడు కళ్యాణ్ దేవ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ కూడా సోసోగానే ఉండటంతో హీరో యాంగిల్ లో చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ అంశం లేకపోయింది. మహతి స్వరసాగర్ బిజిఎం ఓకే. పాటలు తేలిపోయాయి. రామ్ తాళ్ళూరి లాంటి పెద్ద నిర్మాత అయినా ఓటిటికి ఎందుకిచ్చారనే డౌట్ సినిమా చూశాక తీరిపోతుంది. రవీంద్రవిజయ్, ఆన్ శీతల్ పెర్ఫార్మన్స్ లు పర్లేదు. కషిష్ ఖాన్, భానుచందర్ లాంటి వాళ్ళు పెద్దగా ఉపయోగపడలేదు. చాలా ఓపిక చేసుకుని భరిస్తే తప్ప ఈ కిన్నెరసాని మెప్పించడం కష్టం.

Show comments