టెక్ రంగంలో దిగ్గజ కంపెనీల్లో ఒకటి ఇన్ఫోసిస్. ఎన్నో పేరు, ప్రఖ్యాతులు సాధించిన ఈ సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి గురించి తెలిసిందే. ఇన్ఫోసిస్ ఈస్థాయికి చేరుకోవడంలో ఆయన కృషి ఎంతగానో ఉంది. సరికొత్త ఆలోచనలతో కంపెనీని చాలా ఏళ్లు సీఈవోగా ముందుండి నడిపారాయన. ఆయన్ను ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి నారాయణ మూర్తి ఒక హీరోయిన్ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆరంభంలో నారాయణ మూర్తి తన భార్య సుధా మూర్తితో కలసి ఐఐటీ కాన్పూర్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ టైమ్‌లో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రస్తావన తీసుకొచ్చారు.
‘ఓసారి నేను లండన్ నగరం నుంచి తిరిగి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో ప్రముఖ నటి కరీనా కపూర్ కూర్చొన్నారు. హీరోయిన్ను చూసిన ఆనందంలో చాలా మంది ప్రయాణికులు అక్కడకు వచ్చి ఆమెను పలకరించారు. కానీ ఆమె మాత్రం స్పందించలేదు. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి పలకరిస్తే కనీసం నిలబడి నిమిషమో, అర నిమిషమో మాట్లాడతాం. మన నుంచి అవతలి వాళ్లు కూడా అంతే కోరుకుంటారు’ అని నాటి సంఘటనను నారాయణ మూర్తి గుర్తు చేసుకున్నారు. అయితే, వెంటనే ఆయన సతీమణి సుధామూర్తి కలగజేసుకున్నారు.
కరీనాకు కోట్లాది మంది అభిమానులు ఉంటారని.. బహుశా ఆమె అలసిపోయి ఉండొచ్చని సుధామూర్తి అన్నారు. ‘ఓ సాఫ్ట్వేర్ వ్యక్తి, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయిన నారాయణ మూర్తికి 10 వేల మంది ఫ్యాన్స్ ఉంటారేమో..! కానీ, సినీ నటి అంటే కోట్లలో అభిమానులు ఉంటారు కదా’ అని కరీనా కపూర్‌కు ఆమె మద్దతుగా నిలిచారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. అయితే తన ప్రసంగాన్ని కొనసాగించిన నారాయణ మూర్తి.. ‘ఇక్కడ సమస్య ఏంటంటే.. ఎవరైనా మన మీద ఆప్యాయత, అభిమానం చూపించినప్పుడు మనమూ ఆ ప్రేమను తిరిగి చూపించాలి. ఇవన్నీ మన ఈగోను తగ్గించే చిట్కాలు’ అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.