iDreamPost
iDreamPost
కన్నడ స్టార్ హీరో వి రవిచంద్రన్ అంటే మనవాళ్లకు అంతగా పరిచయం లేదు కానీ శాండల్ వుడ్ మార్కెట్ ని కమర్షియల్ గా పెంచినవాళ్లలో ఈయనా ఒకరు. ముఖ్యంగా ప్రేమలోక సినిమాతో సృష్టించిన రికార్డుల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది తెలుగులో ప్రేమలోకంగా డబ్ అయ్యి ఇక్కడా బాగానే ఆడింది. 1991లో నాగార్జున రజనీకాంత్ లు తను కలిసి మొత్తం నాలుగు భాషల్లో శాంతి క్రాంతి అనే ప్యాన్ ఇండియా మూవీ చేసింది కూడా ఈయనే. అది డిజాస్టర్ అయ్యింది కానీ అప్పట్లో దానికైనా ఖర్చు గురించి నేషనల్ మీడియాలో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రామాచారి లాంటి బ్లాక్ బస్టర్లతో ఆయన తిరిగి సెట్ కావడం అదో చరిత్ర
ఇప్పుడీయన ప్రస్తావన రావడానికి కారణం మొట్టమొదటిసారి రవిచంద్రన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వొచ్చని టాక్. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో ఓ కీలక పాత్ర తనకు ఆఫర్ చేసినట్టు సమాచారం. అఫీషియల్ గా చెప్పలేదు కానీ చర్చలు జరుగుతున్నాయట. త్రివిక్రమ్ తన గత సినిమాల్లో ఇదే తరహాలో జయరాం, బోమన్ ఇరానీ లాంటి ఇతర బాషల నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి కొత్తగా ప్రెజెంట్ చేయడం వర్కౌట్ అయ్యింది. అదే తరహాలో ఇప్పటిదాకా ఇక్కడ స్ట్రెయిట్ మూవీ చేయని రవిచంద్రన్ ని ప్రిన్స్ తో కాంబోగా సెట్ చేస్తే ప్లస్ అవుతుందనే అంచనాతో అడిగి ఉండచ్చు.
క్యాస్టింగ్ విషయంలో త్రివిక్రమ్ తీసుకుంటున్న జాగ్రత్తలు, స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడంలో అవుతున్న జాప్యం ఇవన్నీ పర్ఫెక్షన్ కోసమేనట. రవిచంద్రన్ కు చిరంజీవితోనూ మంచి అనుబంధం ఉంది. 1997లో సిపాయి సినిమాలో తన స్నేహితుడి పాత్ర కోసం రెమ్యునరేషన్ ఎంతని అడగకుండా చేసిన సందర్భాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే రవిచంద్రన్ తెలుగులో వచ్చిన ఆఫర్లను మాత్రం పక్కనపెడుతూ వచ్చారు. మిర్చి లాంటి రీమేక్స్ లో తండ్రి పాత్రలు చేస్తూ నెట్టుకుంటూ వచ్చారు. ఒకవేళ త్రివిక్రమ్ సినిమా కనక ఒప్పుకుని ఇక్కడా క్లిక్ అయితే టాలీవుడ్ లో మంచి కెరీర్ దక్కించుకోవచ్చు.