iDreamPost
iDreamPost
ఎల్లుండి ఏప్రిల్ 1 విడుదల కాబోతున్న జాన్ అబ్రహం కొత్త మూవీ అటాక్ బృందం పైకి లేదంటూనే ఆర్ఆర్ఆర్ సునామికి విపరీతమైన ఆందోళనకు గురవుతోంది. దీనికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ లో జాన్ అబ్రహం మాట్లాడుతూ తాను సౌత్ లో తీసే రీజనల్ సినిమాల్లో నటించనని తనకు బాలీవుడ్డే ముఖ్యమని, బిజినెస్ కోసమో డబ్బు కోసమో తన స్థాయిని దిగజార్చుకోననే స్థాయిలో అర్థం వచ్చేలా కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సహజంగానే ఇది సౌత్ మూవీ లవర్స్ కు ఆగ్రహం తెప్పించింది. అసలు ఏ ఉద్దేశంతో జాన్ ఇలా మాట్లాడుతున్నాడని అవగాహన లేకుండా మైకు తీసుకుంటే ఎలా అని నిలదీస్తున్నారు.
నిజానికి ఇటీవలి కాలంలో ఎవరూ నార్త్ సౌత్ అంటూ ఇండస్ట్రీని వేరు చేసి మాట్లాడ్డం లేదు. ఇండియన్ సినిమా అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంత పెద్ద సల్మాన్ ఖాన్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో క్యామియో చేయడానికి ఒప్పుకున్నారు. అది కూడా పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా. అమీర్ ఖాన్ ఆ మధ్య జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను 1990 నుంచే మెగాస్టార్ ఫ్యాన్ అని ఓపెన్ గా చెప్పారు. కెజిఎఫ్ 2 విలన్ క్యారెక్టర్ కోసం సంజయ్ దత్ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా రిస్కీ స్టంట్స్ చేశారు. అది కూడా మార్కెట్ పరిధి తక్కువగా ఉండే కన్నడ మూవీ కోసం. ఇందులోనే రవీనాటాండన్ మరో కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే.
కొన్నేళ్ల క్రితం రజినీకాంత్ కాలాలో నానా పాటేకర్ విలన్ గా నటించడం మర్చిపోగలమా. పేట కోసం నవాజుద్దీన్ సిద్ధిక్ కొన్ని హిందీ ఆఫర్లను త్యాగం చేశాడు. ఇప్పుడు కాదు ఎప్పుడో దశాబ్దాల క్రితం ఓంపురి తెలుగులో అంకురం, రాత్రి లాంటి సినిమాలు చేయడం చరిత్ర గుర్తు చేస్తూనే ఉంటుంది. అమితాబ్ బచ్చన్ సైరా నరసింహారెడ్డి, మనంలో కనిపించారుగా. లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు ఇళయరాజా, కీరవాణిల కోసం ఇక్కడికి వచ్చి పాటలు పాడారు. వీళ్లందరి కంటే జాన్ అబ్రహం ముమ్మాటికి గొప్పవాడు కాదు. అలాంటప్పుడు సౌత్ సినిమా అంటే ఏదో చులకన అభిప్రాయం ఉన్నట్టు మాట్లాడ్డం ముమ్మాటికీ తప్పే
Also Read : Rakshasudu Remake : అక్షయ్ కుమార్ సినిమాకు భారీ డీల్