డ్రగ్స్.. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న సమస్యల్లో ఒకటి. భవిష్యత్‌కు పునాదిగా నిలవాల్సిన యువత.. ఆల్కహాల్‌తో పాటు మాదక ద్రవ్యాల మత్తులో జోగుతోంది. భారత్‌తో పాటు చాలా ప్రపంచ దేశాలకు ఇది పెను సవాల్‌గా మారింది. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఎందరో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ నివారణకు ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నా సరిపోవడం లేదు. ఏదో ఒక రూపంలో డ్రగ్స్ అందుబాటులోకి వచ్చేస్తోంది. దుకాణాల్లో, లారీల్లో, ట్రక్కుల్లో నిత్యం పట్టుబడుతున్న గంజాయి కేసులను బట్టి ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలు తీసుకొచ్చినా.. ఎంత మంది పోలీసులు పహారా కాసినా డ్రగ్స్ కేసులు ఇంకా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే విపరీత పరిణామాలను అర్థం చేసుకున్న అంతర్జాతీయ సమాజం ఈ మహమ్మారిపై పోరాడాలని నిర్ణయించుకుంది. కానీ ఎంత పోరాడినా డ్రగ్స్ ఇంకా వ్యాప్తి చెందుతోందే కానీ సమసి పోవడం లేదు. మాదక ద్రవ్యాల సమస్య సినీ పరిశ్రమలను కూడా వీడటం లేదు. పలువురు సినీ స్టార్లు, మోడల్స్ ఈ కేసులో పట్టుబడటం కూడా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇకపోతే, యూకేలోని ఒక ఎయిర్‌పోర్టులో అమెరికాకు చెందిన సూపర్ మోడల్ జిగి హడిద్‌ను అధికారులు డ్రగ్స్‌తో పట్టుకున్నారు.
అమెరికా నుంచి ఒక ప్రైవేట్ విమానంలో యూకేలోని కైమన్ అనే ద్వీపానికి జిగి హడిద్ వెళ్లారు. ఈ క్రమంలో ఓవెన్ రాబర్ట్స్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమె బ్యాగ్స్‌ను చెక్ చేశారు. అందులో గంజాయితో పాటు వాటిని తాగేందుకు వినియోగించే వస్తువులు కూడా లభించాయి. రెడ్‌హ్యాండెడ్‌గా అధికారులకు దొరికిపోయిన టైమ్‌లో గిగితో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా కలిసే ఉన్నారు. గిగితో పాటు ఆమె స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరాన్ని అంగీకరించడంతో గిగికి న్యాయమూర్తి 1,000 డాలర్ల జరిమానా విధించారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు చేయడంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు.