iDreamPost
android-app
ios-app

పోలీసుల ముందు నిజం ఒప్పుకున్న దర్శన్

Darshan Thoogudeepa : రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ సూపర్ స్టార్, డీ బాస్ దర్శన్ తూగదీప నిజం అంగీకరించాడు. అతడ్ని ఎలా కొట్టి చంపాడో పోలీసులకు వెల్లడించాడు.

Darshan Thoogudeepa : రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ సూపర్ స్టార్, డీ బాస్ దర్శన్ తూగదీప నిజం అంగీకరించాడు. అతడ్ని ఎలా కొట్టి చంపాడో పోలీసులకు వెల్లడించాడు.

పోలీసుల ముందు నిజం ఒప్పుకున్న దర్శన్

రేణుక స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్ తూగదీప అరెస్ట్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం కలిగించింది. ప్రియురాలు పవిత్రగౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడన్న కారణంతో చిత్రదుర్గం ప్రాంతానికి చెందిన రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి.. బెంగళూరుకు తీసుకు వచ్చి అత్యంత దారుణంగా కొట్టి చంపి కాలువలో పడేసిన సంగతి విదితమే. జూన్ నెలలో ఈ ఘటన చోటుచేసుకోగా.. తర్వాత అరెస్టు పరంపర మొదలైంది. దర్శన్‌తో పాటు పవిత్రగౌడ, మరో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తొలుత వీరందరినీ పరప్పన్ జైలులో ఉంచగా.. అక్కడ దర్శన్ వీడియో లీక్ కావడంతో ఆయనను బళ్లారి జైలుకు తరలించారు. ఇతర నిందితులను మైసూరు, తమకూరు, షిమోగా, ధార్వాడ్, బెల్గాం, విజయపుర, కలబురిగి జైళ్లకు తరలించారు.

పవిత్ర గౌడ.. పరప్పన్ జైలులోనే ఉంది.  జూన్ 9న  రేణుకా స్వామి హత్య జరిగింది.  బెంగళూరులోని సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న మురికినీటి కాలువ దగ్గర రేణుకా స్వామి మృతదేహం బయటకు రావడంతో ఈ హత్య కేసు వెలుగు చూసింది. అప్పటి నుండి సుమారు మూడు నెలల నుండి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు నిందితులు. అయితే ఈ కేసులో చార్జీషిట్ దాఖలు చేశారు పోలీసులు. పవిత్ర గౌడ ఏ1, దర్శన్ ఏ2గా పేర్కొన్నారు. మరో 15 మంది పాత్ర ఉన్నట్లు 3,991 పేజీలతో చార్జీషీట్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఈ హత్యకు సంబంధించి కీల విషయాలను హీరో దర్శన్ పోలీసులకు వెల్లడించాడు. రేణుకా స్వామిని తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. అతడి మెడ, ఛాతి,తలపై, చేతులపై చెట్టుకొమ్మతో కొట్టినట్లు ఒప్పుకున్నాడు. అతడిని చెప్పుతో కొట్టాలని పవిత్రగౌడకు చెప్పినట్లు తెలిపాడు. తన వాంగ్మూలాన్ని పోలీసుల ముందు పేర్కొన్నాడు.

కాగా, ఈ కేసులో పవిత్ర గౌడ రేణుకా స్వామి హత్యకు ప్రధాన కారణమని, ఇతరులను ఉసిగొల్పి.. వారితో అతడిని చంపించేందుకు కుట్ర పన్నినట్లు విచారణలో రుజువైందని చెబుతున్నారు. పవిత్రకు జుగుప్సాకరమైన సందేశాలు పంపాడని, అవి దర్శన్‌కు కోపానికి కారణమై.. హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో మరోసారి దర్శన్‌కు చుక్కెదురైంది. దర్శన్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది బెంగళూరు కోర్టు. సెప్టెంబర్ 12 వరకు ఆయన కస్టడీని పొడిగించింది. దీంతో మరో మూడు రోజుల పాటు కన్నడ స్టార్ నటుడు జైలులోనే ఉండనున్నాడు. ఆ తర్వాత చార్జిషీటు నిందితులకు అందించనున్నారు. ఆ తర్వాత వారికి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.