యాంకర్ సుమ మంచి మనసు.. ఇంత మంది వృద్దులకు ఎన్నాళ్ల నుండో అండగా!

కేరళలో పుట్టిన తెలుగింట మెట్టిన యాంకరమ్మ సుమ. 25 ఏళ్లుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా వెలుగొందుతున్న ఆమె.. మరోసారి తన మంచి మనస్సును చాటుకుంది.

కేరళలో పుట్టిన తెలుగింట మెట్టిన యాంకరమ్మ సుమ. 25 ఏళ్లుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా వెలుగొందుతున్న ఆమె.. మరోసారి తన మంచి మనస్సును చాటుకుంది.

యాంకర్ సుమ.. ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు. తెలుగు బుల్లితెరపై తిరుగులేని మహారాణిగా కొనసాగుతుంది. సుమారు 25 ఏళ్ల నుండి స్మాల్ స్క్రీన్‌లో వాహ సాగిస్తోన్న ఈ కేరళ కుట్టి.. తెలుగు భాషను కూడా పిండి పిచ్చి చేసేస్తోంది. తెలుగు ఇంట పుట్టిన అమ్మాయిలు కూడా అంత అనర్గళంగా మాట్లాడరేమో అనిపిస్తుంది ఆమె యాంకరింగ్ చూస్తుంటే. చిన్నప్పుడు వస ఎక్కువ తినేందేమో అనిపించేలా.. మైక్ కనబడితే చాలు వస పిట్టలాగా నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటుంది. ఇండస్ట్రీ మొత్తం సుమ అక్క అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీ సక్సెస్ మీట్, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ అయితే యాంకరింగ్‌లో టాప్ నాచ్. ఆమెను కొట్టగల యాంకర్, యాంకరమ్మ ఇంకా రాలేదనే చెప్పొచ్చు.

ప్రస్తుతం ఆమె సుమ అడ్డా అనే షోతో అలరిస్తోంది. తాజాగా ఓం బీం బుష్ చిత్ర యూనిట్ సందడి చేసింది. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, దర్శకుడు శ్రీహర్ష ఈ షోకు విచ్చేశారు. పంచులకే పంచ్ అయినా సుమకు పంచులేసి అదరగొట్టాడు రాహుల్ రామకృష్ణ. మీ సినిమా చాలా కామెడీ ఉండొచ్చేమో కానీ.. మా గేమ్ షో మాత్రం అని సుమగానే.. ట్రాజెడీగా ఉంటుందా అంటూ కౌంటరిచ్చాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా.. చూస్తే ఫుల్ ఫన్‌తో నిండిపోయింది. అలాగే చివరిలో ఈ చిత్రం బృందం యాంకర్ సుమకు ఓ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. మార్చి 22న సుమ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఓల్డేజ్ హోంలో ఉంటున్న వృద్దులు అతిధులుగా రాగా, వారి మధ్యలో కేక్ కట్ చేసింది సుమ.

వృద్దులంతా ఆమెకు రోజాపూలు తెచ్చి విషెస్ చేశారు. ఇందులో ఓ వృద్దురాలు మాట్లాడుతూ.. ‘మీరున్నంత వరకు మాకు ఏ లోటు లేదు. మీ మీద ఆశలు పెట్టుకుని బతుకుతాం. మాకు ఎవ్వరూ గుర్తుకు రావట్లేదు కూడా. మీరే మాకు అండ’ అంటూ సుమను పట్టుకుని మాట్లాడింది. దీన్ని బట్టి చూస్తే.. ఆమె ఆ అనాథ శరణాలయానికి స్పాన్సర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి తన మంచి మనస్సు ఏమిటో ప్రేక్షకులకు తెలిసింది. ’ద నెస్ట్- హోమ్ ఫర్ ద ఏజ్డ్‘అనే అనాథ శరణాలయానికి గుప్త దానం చేస్తున్నట్లు సమాచారం. ఇది హైదరాబాద్ మియాపూర్‍లో ఉంది. ఇదే కాదూ.. సుమ గతంలోనూ అనేక అనాథ శరణాలయాలకు డబ్బులు స్పాన్సర్ చేసింది. అంతేనా కరోనా సమయంలో కూడా ఫండ్ రైజ్ చేసి.. ఎంతో మందికి ఆహారాన్ని అందించింది.

అలాగే ఫెస్టివల్ ఫర్ జాయ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి.. ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది సుమ. గత ఏడాది ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ. 5 లక్షల చెక్ కూడా అందించింది. తిత్లీ తుఫాన్ దాటికి రోడ్డున పడ్డ.. వృద్ధ దంపతులకు అండగా నిలవడంతో పాటు ఇల్లు కూడా కట్టించింది. 30 మంది విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తోంది ఈ యాంకరమ్మ. ఇలాంటి గుప్త దానాలెన్నో చేస్తోంది. కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదన్న సామెతను తూచా తప్పకుండా పాటిస్తోంది. చిన్న సాయం చేసి.. డబ్బాలు కొట్టుకుంటున్న ఈ రోజుల్లో.. పెద్ద పెద్ద సాయం చేసి..చెప్పుకోవడం లేదు ఆమె. నిజంగా మీకు హ్యేట్సాఫ్ సుమ.

Show comments