తెలుగు చిత్ర పరిశ్రమలో ఏటా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. భారత్‌లో బాలీవుడ్ తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మాణం అయ్యేది టాలీవుడ్లోనే. అయితే ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా విజయాల శాతం మాత్రం చాలా తక్కువగానే ఉంది. హిట్లుగా నిలిచే చిత్రాల సంఖ్యను వేళ్ల మీదే లెక్కపెట్టొచ్చు. నాలుగైదు సినిమాలు మాత్రమే సూపర్ హిట్లుగా నిలుస్తాయి. కొన్ని చిన్న చిత్రాలు మ్యాజిక్ చేసి.. హిట్స్‌గా నిలిచిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే ఇంకొన్ని చిన్న మూవీస్ మంచి బజ్ తెచ్చుకొన్నా యావరేజీలుగా, మంచి ప్రయత్నాలుగా నిలిచిపోతాయి. అలాంటి చిత్రమే ‘7:11 పీఎం’.
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ‘7:11 పీఎం’ ఫిల్మ్ ఇటీవల విడుదలైంది. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కథలు తెలుగులో చాలా అరుదుగా మాత్రమే తెరకెక్కుతాయి. అలా రూపొందిన సినిమానే ఇది. చైతూ మాదాల దర్శకత్వం వహించిన ‘7:11 పీఎం’లో సాహస్ పగడాల, దీపికా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడీ చిత్రం డిజిల్ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ‘7:11 పీఎం’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
‘7:11 పీఎం’ మూవీలో రఘు కారుమంచి, డాక్టర్ భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు నటించారు. ఇక, ఈ సినిమా కథ విషయానికొస్తే.. హంసలదీవికి చెందిన రవి (సాహస్ పగడాల) ఎప్పుడూ తన గ్రామం బాగుండాలని తపిస్తుంటాడు. విమల (దీపికా రెడ్డి)ని అతడు ప్రేమిస్తాడు. కొందరు స్వార్థపరుల నుంచి గ్రామస్థులను కాపాడే ప్రయత్నంలో అనుకోకుండా ఊళ్లోకి వచ్చిన ఒక బస్సు ఎక్కుతాడు. కళ్లు తెరచి చూస్తే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వచ్చినట్లు గ్రహిస్తాడు. తన బస్సు ఎక్కింది 1999లో అయితే దిగేసరికి మెల్బోర్న్లో 2024లో కాలం నడుస్తుంటుంది. 25 ఏళ్ల కాలం ముందుకు వెళ్లిపోయిన రవి.. మళ్లీ తన ఊరికి చేరుకున్నాడా? వెళ్లి అక్కడేం చేశాడనేది ఓటీటీలోనే చూడాలి.
ఇదీ చదవండి: ‘ఖుషి’ కాదు.. విజయ్ దేవరకొండకు నష్టాలే!