మొరాకోలో భారీ భూకంపం.. లైవ్‌లో యూట్యూబర్ అన్వేష్..!

ఇటీవల ప్రపంచ దేశాల్లో వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం వల్ల 50 వేల మందికి పైగా మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో పలుమార్లు భూమి కంపిస్తుందని.. క్షణక్షణం భయంతో బతకాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్, పాకిస్థాన్, ఇండోనేషియా, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాల్లో తరుచూ భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ధాటికి పలు భవనాలు, కట్టడాలు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం మొరాకో సందర్శిస్తున్న ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ అన్వేష్ అతని స్నేహితురాలు, యూట్యూబర్ మెలిసా ఇద్దరూ అక్కడే ఉన్నారు. అక్కడ పరిస్థితులు ప్రత్యక్షంగా వీడియో తీసి చూపించారు. వివరాల్లోకి వెళితే..

మొరాకోలో శుక్రవారం అర్థరాత్రి 11.11 గంటల ప్రాంతంలో మర్రకేష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.8 గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జిఎస్) వెల్లడించింది. మొరాకో మర్రకేష్ కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌జిఎస్ అధికారులు తెలిపారు. కాగా, భూ అంతర్భాగంలో దాదాపు 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించి ఉంటాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నా అన్వేషన యూట్యూబర్ అన్వేష్ అతని స్నేహితురాలు మెలిసా కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా అన్వేష్ లైవ్ లో వీడియో చూపిస్తూ అక్కడ పరిస్థితులను వివరించాడు.

యూట్యూబర్ అన్వేష్ మాట్లాడుతూ.. రాజధాని రాబాట్ కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న రబాత్ నుంచి మర్రకేష్ వరకు వచ్చిన భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు. ఇండ్ల నుంచి ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు తీశారు. భయం భయంగా రాత్రంతా రోడ్లు, పార్కుల వద్ద గడిపారు. భూకంప ధాటికి పాత భవనాలు మొత్తం కుప్పకూలిపోయాయి. ఇక్కడ సందర్శన కోసం వచ్చిన చైనా, ఫ్రాన్స్ ఇతర దేశ యాత్రికులు భయంతో గజ గజ వణికిపోయారు. అందరం రోడ్లపైకి వచ్చేశాం.. ప్రస్తుతం సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాం. మరోసారి కూడా ఇక్కడ భూకంపం వచ్చే సూచన ఉండటంతో అందరూ దూరంగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోతున్నాం, ప్రస్తుతం మా సామాన్లు మొత్తం హాస్టల్ లోనే ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి’అని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. మొరాకోలో సంభవించిన భూకంపం గురించి అక్కడి ప్రభుత్వం ఓ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం భూకంప ధాటికి ఇప్పటి వరకు 296 మంది చనిపోయారు. అల్ హౌజ్, అజిలాల్, క్వార్జాజెట్ ప్రాంతాల్లో ఎక్కువగా మరణాలు సంభవించాయి. మరో 153 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. ఎక్కడ చూసినా భవనాలు ఇతర కట్టడాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండవొచ్చని అంటున్నారు. ఇప్పటికే సహాయక బృందాలు రంగంలోకి దిగి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రభుత్వం తెలిపింది. ఇక 2004 లో అల్ హెసిమాలో వచ్చిన భూకంపంతో దాదాపు 628 మంది మృత్యువాత పడ్డారు.

Show comments