వీడియో: యువతిని కిడ్నాప్ చేసిన మిలిటెంట్లు.. చంపొద్దంటూ వేడుకోలు

ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడులతో దేశం మొత్తం కకావికలం అయ్యింది. వేలకొద్ది రాకెట్లతో జరిపిన దాడుల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. వందల మంది మృత్యువాత పడ్డాగా, తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులకు తెగబడుతున్నారు. మిలిటెంట్ల దాడులను ఇజ్రాయిల్ సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ పాలస్తీనపై యుద్ధం ప్రకటించింది. మిలిటెంట్లకు, సైన్యానికి మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ లోకి చొరబడిన మిలిటెంట్లు పౌరులను బంధించి వాహనాల్లో తీసుకెళ్తున్న దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఓ యువతిని బంధించిన మిలిటెంట్లు ఆమెను బైక్ పై తీసుకెళ్తుండగా చంపొద్దంటూ వేడుకుంటున్న దృష్యాలు కలిచివేస్తున్నాయి.

హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ లో విధ్వంసానికి తెరలేపారు. మానత్వం మరిచి వందలాది మంది ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా ఓ యువతిని హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుమారు 25 ఏళ్ల వయసున్న నోవా అర్గమణి అనే యువతిని హమాస్ మిలిటెంట్లు బైక్ పై తీసుకెళ్తూ కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో యువతి తనను చంపొద్దని వేడుకుంటున్నట్లు ఉంది. నన్ను చంపొద్దు అని ప్రాధేయపడడం, వెనకాల హమాస్ మద్దతుదారులు బెదిరించడం కనిపిస్తుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ అవి నాథన్ ను కూడా హమాస్ తీవ్రవాదులు బంధించి తీసుకెళ్తున్న దృష్యాలను వీడియోలో చూడొచ్చు.

కాగా ఈ జంట ఓ మ్యూజిక్ ఫెస్టివల్ కి హాజరయ్యేందుకు ఇజ్రాయిల్ వెళ్లిన సమయంలో హమాస్ మిలిటెంట్ల చేత కిడ్నాప్ అయ్యారని తెలుస్తోంది. అవి నాథన్ సోదరుడు మోషఏ ఓర్ సోషల్ మీడియా ద్వారా తప్పిపోయినట్లుగా తెలిపారు. అర్గమణి కిడ్నాప్ గురించిన వివరాలను యువతి కుటుంబానికి తెలియజేశారు. ఆమెను విడిచిపెట్టాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. కాగా ఆమెను ఫోన్ లో సంప్రదించడానికి ప్రయత్నించాం, అందుబాటులో లేదని ఇజ్రాయిల్ నేషనల్ న్యూస్ నివేదించింది.

Show comments