iDreamPost
android-app
ios-app

చెత్తలో 60 ఏళ్ల పాత పుస్తకం.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడ్ని చేసింది!

చెత్తలో 60 ఏళ్ల పాత పుస్తకం.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడ్ని చేసింది!

అదృష్టం ఎప్పుడు? ఎవరి? ఎలా? వరిస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. అదృష్టం వరిస్తే రాత్రి రాత్రికి మన జీవితాలే మారిపోతాయి. చెత్త కూడా మనల్ని కోటీశ్వరుడ్ని చేసే అవకాశం ఉంది. తాజాగా, చెత్తలో దొరికిన పాత పుస్తకం కారణంగా ఓ వ్యక్తి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు 60 ఏళ్ల క్రితానిదైనా అది రాత్రికి రాత్రి అతడ్ని కోటీశ్వరుడ్ని చేసింది. ఈ సంఘటన చిలీలో చోటుచేసుకుంది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. చిలీకి చెందిన ఎక్సెక్విల్‌ హినోజోసా అనే ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఇంటిని శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడికి చెత్తలో ఓ పాత పుస్తకం దొరికింది. దాన్ని పరీక్షించిన అతడికి అది 60 ఏళ్ల పాతదిగా తెలిసింది.

అంతేకాదు! అది తండ్రి బ్యాంకు పాస్‌ పుస్తకం అని గుర్తించాడు. హినోజోసా తండ్రి 1960-70లలో ఓ బ్యాంకులో 1.40 లక్షల చిలీ డబ్బును డిపాజిట్‌ చేశాడు. ఆ డబ్బుతో ఇళ్లు కొనుక్కుందామని అనుకున్నాడు. అయితే, ఇళ్లు కొనుక్కోకుండానే ఆయన చనిపోయాడు. దీంతో ఆ డబ్బులు బ్యాంకులో అలానే ఉండిపోయాయి. దాదాపు 60 ఏళ్లు ఆ పాస్‌ పుస్తకం చెత్తలో ఉండిపోయింది. తాజాగా, అది హినోజోసాకు దొరికింది. బ్యాంకు వాళ్లను సంప్రదించాడు. వారు డబ్బులు తిరిగి ఇవ్వటం కుదరదు అన్నారు.

దీంతో అతడు న్యాయపోరాటానికి దిగాడు. కోర్టులో దీనిపై కేసు వేశాడు. తాజాగా, విచారణ జరిపిన కోర్టు హినోజోసాకు మద్దతుగా తీర్పు నిచ్చింది. వడ్డీతో సహా డబ్బులు అతడికి తిరిగి చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. ఈ నేపథ్యంలో హినోజోసా ఏకంగా 10 కోట్ల రూపాయలు సొంతం చేసుకున్నాడు. తండ్రి కారణంగా 60 ఏళ్ల తర్వాత కోటీశ్వరుడు అయ్యాడు. మరి, చెత్తలో దొరికిన పాత పాస్‌ పుస్తకం కారణంగా కోటీశ్వరుడు అయిన హినోజోసాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.