iDreamPost
android-app
ios-app

ఢిల్లీ మారణహోమానికి కారణమైన వ్యాపారుల అత్యాశ

ఢిల్లీ మారణహోమానికి కారణమైన వ్యాపారుల అత్యాశ

ఎక్కడో ఉక్రెయిన్ మీద రష్యా దాడిచేస్తే మన వీధి చివర ఉన్న షాపులో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. యుద్ధంవల్ల సరుకుల రవాణా ఛార్జీలు పెరిగి, ధరలు పెరిగాయి అనుకోవడానికి లేదు. ఆ వస్తువులు యుద్ధం మొదలవడానికి చాలారోజుల ముందు షాపుకి వచ్చి ఉంటాయి. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం వల్ల ఇలా జరుగుతుంది. వ్యాపారుల ఇలాంటి అత్యాశ వలన 283 సంవత్సరాల క్రితం ఢిల్లీ నగరం కనీవినీ ఎరుగని విధ్వంసానికి, దోపిడికి గురయి, నగర వీధుల్లో రక్తం ఏరులై పారింది.

నాదిర్ షా దండయాత్ర

పద్దెనిమిదో శతాబ్దం తొలిరోజుల్లో ప్రపంచంలో ఉన్న మూడు ఇస్లాం రాజ్యాలలో అత్యంత ధనవంతమైనది, బలహీనమైనది భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్యం. బాబర్, హుమాయూన్ లు స్థాపించిన సామ్రాజ్యం అక్బర్ కాలంనుంచి సుస్థిరమై క్రమేపీ పెరుగుతూ, ఔరంగజేబ్ కాలం నాటికి విశాలమైన, బలవంతమైన, ఐశ్వర్యవంతమైన రాజ్యంగా రూపుదిద్దుకుంది. ఔరంగజేబ్ తర్వాత గద్దెనెక్కిన పాలకుల బలహీనత, అంతర్గత యుద్ధాల కారణంగా సామంతరాజులు ఎక్కడికక్కడ స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో రాజ్యం బాగా చిన్నదై పోయింది కానీ, ఖజానా మాత్రం తగ్గలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో కేవలం దోపిడీ లక్ష్యంగా పర్షియా పాలకుడు నాదిర్ షా భారతదేశం మీద దండయాత్ర చేయాలనుకున్నాడు. తన వ్యతిరేకులు సింధునదికి తూర్పు భాగంలో ఉన్న మొఘల్ భూభాగంలో తలదాచుకున్నారని, వారిని పట్టి తనకు అప్పగించకపోతే దండయాత్ర తప్పదని 1738లో అప్పటి మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షాకి ఉత్తరం పంపించాడు. పేరుకి అది మొఘల్ రాజ్యంలో భాగం అయినా అక్కడ మహమ్మద్ షా మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు.

దాంతో 1938లో నలభై మంది సైనికులతో పర్షియా నుంచి భారత్ వైపు బయలుదేరాడు నాదిర్ షా. దారిలో దారిలో కాందహార్, గజినీ, కాబూల్, పంజాబ్ లను జయించి, ఢిల్లీ వైపు నాదిర్ షా వస్తున్న సంగతి మహమ్మద్ షాకి తెలిసింది. రాజ్యం చిన్నదైనా, ఖజానా పెద్దది కాబట్టి మహమ్మద్ షా వద్ద పెద్ద సైన్యం ఉండేది. సైనికులు, సహాయ సిబ్బంది కలిపి మూడు లక్షల మందితో నాదిర్షాను ఎదుర్కోవడానికి బయలుదేరాడు.

కర్నాల్ యుద్ధం

ఫిబ్రవరి 24,1739న ఢిల్లీకి ఉత్తరాన 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నాల్ అన్నచోట ఇరుపక్షాలు తలపడ్డాయి. మొఘల్ సైన్యంతో పోలిస్తే చిన్నదైన సైన్యంతో చురుకైన వ్యూహం, మెరుగైన ఆయుధ సంపత్తి ఉపయోగించి యుద్ధం మొదలైన మూడు గంటలకే తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది పర్షియన్ సైన్యం. సమయం గడిచేకొద్దీ మరింత ప్రాణనష్టం తప్ప మరే ప్రయోజనం ఉండదని గ్రహించిన మహమ్మద్ షా లొంగిపోవడానికి సిద్ధం అని ప్రత్యర్థికి కబురు పంపించాడు. నాదిర్షా గుడారంలో శాంతి చర్చలు జరిగాయి.

మహమ్మద్ షాకు తనతో సమానంగా ఆసనం ఏర్పాటు చేసి, ఓడిపోయినా మొఘల్ పాదుషా గౌరవానికి లోటు లేకుండా తనకేం కావాలో చెప్పాడు. పర్షియా నుంచి భారతదేశాన్ని పాలించే ఆలోచనలేదు కాబట్టి, పెద్ద మొత్తంలో పరిహారం, గుర్రాలు, ఒంటెలు, తిరుగు ప్రయాణంలో పర్షియా చేరేవరకూ ఆహార పదార్థాలు కావాలని చెప్పాడు నాదిర్షా. అవన్నీ సమకూరే వరకూ కర్నాల్ దగ్గర తనకూ, తన సైన్యానికి వసతి, ఇతర సౌకర్యాలు సమకూర్చాలని చెప్పగానే, శత్రువు ఢిల్లీలో ప్రవేశించకుండా వెనుతిరుగుతున్నందుకు ఆనందించి, నాదిర్షా కోరినవి సమకూర్చడానికి ఢిల్లీకి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాడు మహమ్మద్ షా.

కొంపముంచిన ఉపసేనాధిపతి అసంతృప్తి

జరిగిన రెండు మూడు గంటల యుద్ధంలో మొఘల్ సైన్యాధ్యక్షుడు ఖాన్ దౌరాన్ తన సైన్యం ముందు నిలిచి, వీరోచితంగా పోరాటం చేశాడు. వొళ్ళంతా గాయాలు తగిలిన అతను ఉన్న ఏనుగును పర్షియన్ సైనికులు కూల్చడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయాల నుంచి కోలుకుంటాడో లేదో అన్న అతని పరిస్థితి చూసిన మహమ్మద్ షా అతని స్థానంలో మరొకరికి ఆ పదవి ఇవ్వాల్సి వచ్చింది. మొఘల్ సైన్యంలో అప్పుడు ఇద్దరు ఉపసేనాధిపతులు ఉన్నారు. వీరిలో సాదత్ ఖాన్ తన సైన్యంతో ప్రత్యర్థి సైన్యంలోకి చొచ్చుకుపోయి గొప్ప పోరాటం చేసి, వారికి బంధీగా చిక్కి, యుద్ధం ముగిశాక సంధి అనంతరం విడుదల చేయబడ్డాడు. నిజాం ఉల్ ముల్క్ అనే మరొక ఉపసేనాదిపతి పోరాటంలో పాలుపంచుకోకుండా వెలుపలే ఉండి తన సైన్యాన్ని నడిపించాడు.

మహమ్మద్ షా అనూహ్యంగా సైన్యాధ్యక్షుడిగా నిజాం ఉల్ ముల్క్ ని నియమించాడు. ఈ నిర్ణయం సైనికులతో పాటు, సాదత్ ఖాన్ లో కూడా తీవ్ర అసంతృప్తి కలిగించింది. అతను తనకు బాగా నమ్మినబంటు అయిన సైనికుడితో నాదిర్షాకు ఒక వర్తమానం పంపించాడు. ఢిల్లీ ఖజానాలో నువ్వు కలలో కూడా ఊహించలేనంత సంపద ఉంది. దాంతో పోలిస్తే నువ్వు అడిగిన పరిహారం ఏ మూలకూ రాదు అని ఆ సందేశం. అది చదివి తను ఢిల్లీలోకి రావాలనుకుంటున్నట్టు వర్తమానం పంపించాడు నాదిర్షా.

అన్నట్టుగానే ఇరవైవేల మంది సైనికులతో మార్చి 20న ఢిల్లీలో ప్రవేశించాడు నాదిర్. ఇష్టమున్నా లేకపోయినా సకల లాంఛనాలతో స్వాగతం పలికారు మహమ్మద్ షా. ఎర్రకోటలోని దివానీ ఖాస్ లోని నెమలి సింహాసనం మీద కూర్చుని, తన పక్కన మరో ఆసనంలో మహమ్మద్ షాని కూర్చోబెట్టాడు. గెలిచిన సైన్యం ఓడిపోయిన రాజ్యం మీద పడి దోచుకోవడం, అత్యాచారాలు, మారణకాండ సాగించడం ఆనవాయితీ. అయితే అలాంటి పనులు ఏమీ చేయకూడదని తన సైనికులకు ఆదేశాలు ఇచ్చాడు నాదిర్షా. దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే విచారణ లేకుండా నరికి చంపుతానని హెచ్చరిక జారీ చేశాడు.

ఆకాశాన్నంటిన ధరలు

నాదిర్ షాతో యుద్ధం జరగబోతోంది అనగానే ఢిల్లీలో వర్తకులు సరుకుల ధరలు పెంచేశారు. పర్షియన్ సైన్యం నగరంలో ప్రవేశించబోతోంది అనగానే ఆ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఈలోగా నాదిర్ షాకి చెల్లించవలసిన పరిహారాన్ని ఢిల్లీలో వర్తకులు, జమీందార్ల నుంచి పన్ను రూపంలో వసూలు చేయాలని పాదుషా భావిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. దాంతో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. సామాన్య ప్రజలు ఈ ధరలు చూసి బెంబేలెత్తి పాదుషాకి తమ గోడు విన్నవించుకోవడానికి ఎర్రకోటకు వచ్చారు. అయితే అక్కడ సింహాసనం మీద మహమ్మద్ షా బదులు నాదిర్ షా కనిపించాడు వారికి.

ఇప్పుడు విజేతగా రాజ్యపాలన కూడా నాదిర్ బాధ్యత కాబట్టి ధరలు అదుపులో ఉండేలా చూడమని ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలు అయిన పహార్ గంజ్, చాందినీ చౌక్ వద్దకు తన సైనికులను పంపించాడు. వ్యాపారులకు, సైనికులకు మధ్య జరిగిన గొడవలో ఒకచోట ఒక పర్షియన్ సైనికుడు హత్యకు గురయ్యాడు. ఈ వార్త శరవేగంగా అనేక రకాలుగా రూపు మార్చుకుని నగరమంతా వ్యాపించింది. ప్రజలు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేసి పర్షియన్ సైనికులని చంపేస్తున్నారు అని మొదలైన పుకారు, ఎర్రకోటలో నాదిర్షాను చంపేశారని మారింది. దాంతో రెచ్చిపోయిన పౌరులు చేతికందిన ఆయుధం తీసుకుని కనిపించిన పర్షియన్ సైనికుల మీద దాడి చేసి, వాళ్ళని చంపి, వారి చేతుల్లో మరణించారు. మార్చి 21 రాత్రికి దాదాపు మూడు వేలమంది పర్షియన్ సైనికులు ఢిల్లీ ప్రజల చేతిలో మరణించారు.

సాధారణ ప్రజల ఊచకోత

ప్రజల తిరుగుబాటు గురించి తెలుసుకున్న నాదిర్ షా తన సైనికులతో కలిసి మార్చి 22న ఎర్రకోట వదిలి నగర పర్యటనకు వచ్చాడు. దారిలో పర్షియన్ సైనికుల శవాలను చూడగానే ఆగ్రహంతో రగిలిపోయిన నాదిర్ షా చాందిని చౌక్ లోని సునేరీ మసీదు పైకెక్కి, తన సైనికుల వైపు చూస్తూ, ఒరలో నుంచి తన ఖడ్గం దూసి ఆకాశం వైపు చూపించాడు. సాధారణ ప్రజల మీద అదపులేని మారణహోమం, దోపిడీలు, అత్యాచారాలు జరుపుకోమని తన సైనికులకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చిన సంకేతం అది. కాతిల్-ఏ-ఆమ్ అనే ఈ ఉన్మాదకాండలో సైనికులు చేసిన దోపిడీలో కొంతభాగం ఖజానాకు అందించి, కొంత భాగం తను ఉంచుకోవచ్చు.

అప్పటివరకూ తమ ప్రభువు వేసిన కళ్ళేలు తొలగిపోవడంతో పర్షియన్ సైనికులు ఢిల్లీ నగరంలో స్వైరవిహారం చేశారు. చిన్నా పెద్దా, ఆడా మగా తేడా లేకుండా ఊచకోత కోసి, విచ్చలవిడిగా లూటీలు మొదలుపెట్టారు. విషయం తెలిసిన మహమ్మద్ షా తన మంత్రులతో వచ్చి నాదిర్ షా కాళ్ళమీద పడి, ఏం కావాలంటే అది తీసుకుని, మారణకాండ ఆపమని వేడుకున్నాడు. అనేక గంటలపాటు ఢిల్లీ వీధుల్లో రక్తం పారించాక తన సైనికులకు మారణహోమం ఆపమని ఆదేశాలు ఇచ్చాడు నాదిర్షా.

ఢిల్లీ ప్రజలనుంచి రెండు కోట్ల రూపాయలు జరిమానా విధించాడు నాదిర్ షా. ప్రభుత్వ ఖజానా తాళాలు అతని చేతిలో పెట్టారు మొఘల్ అధికారులు. నెమలి సింహాసనం, జంట వజ్రాలు కోహినూర్, దరియా నూర్ తో సహా వెలకట్టలేని బంగారం, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులు అన్నీ స్వాధీనం చేసుకుని మే మొదటి వారంలో ఢిల్లీ వదిలి తిరుగు ప్రయాణం ఆరంభించారు పర్షియన్లు. ఆ దోపిడీ చేసిన సంపద మోయడానికి ఇరవైవేల గాడిదలు, ఇరవైవేల ఒంటెలు అవసరమయ్యాయి. భారతదేశంలో కొల్లగొట్టిన సంపదవల్ల మూడు సంవత్సరాలు తన రాజ్యంలో అన్ని రకాల పన్నులు రద్దు చేశాడు నాదిర్ షా.