Heart Attack Symptoms: గుండెపోటు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు! తినకూడనవి, తినాల్సినవి.. పూర్తి వివరాలు!

Heart Attack, Symptoms, Causes, in Telugu: గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏంటి? గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? ఇలాంటి విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Heart Attack, Symptoms, Causes, in Telugu: గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏంటి? గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? ఇలాంటి విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గత కొన్ని నెలలుగా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. గతంలో వయసు పైబడిన వారు, ఊబకాయంతో బాధపడేవారిలో హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండేది. కానీ, మారిన జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది. గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఆక్సిజన్, పోషకాలని రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకి సరఫరా చేసేది గుండే. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్న యువతలో కూడా అకస్మాత్తుగా గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కాలం తర్వాత ఈ గుండెపోటు మరణాలు చాలా పెరిగాయి. గుండెలోని రక్తనాళాలు బ్లాక్‌ అవ్వడం వల్ల రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోతుంది. అప్పుడు గుండెపోటు సంభవిస్తోంది. మరి ఈ గుండెపోటు లక్షణాలు ఏంటి? వచ్చే ముందు ఎలా గుర్తించాలి? నియంత్రణ చర్యలేంటి? గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గుండెపోటు రావడానికి గల ప్రధాన కారణాలు (Reasons for Heart Attack):

షుగర్‌(మధుమేహం), బీపీతో బాధపడేవారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. అలాగే అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నా, సరైన శారీరక శ్రమ లేకపోయినా గుండెపోటు బారిన పడొచ్చు. ప్రస్తుతం చాలా మంది ఏసీ రూముల్లో కూర్చోని, కంప్యూటర్‌ ముందు గంటల తరబడి పని చేస్తూ ఉంటారు. దాంతో సరైన శారీరక శ్రమ తగలదు. అలాంటి వారు కనీసం రోజూ ఓ 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి. అలా చేయకపోతే కూడా హార్ట్‌ ఎటాక్‌ రావొచ్చు. ధూమపానం, మద్యం సేవించడం అలవాటు ఉన్నవారికి కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. వీటికి తోడు.. వృత్తిపరమైన, వ్యక్తిగత ఒత్తిడి, అధిక కొవ్వు పదార్థాలు తినడం వల్ల కూడా హార్ట్‌ ఎటాక్‌ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గుండెపోటు వస్తుందని చెప్పే లక్షణాలు (Symptoms): 

  • గుండెలో ఒక్కసారిగా తీవ్రమైన నొప్పి వస్తుంది.
  • ఆ నొప్పి మెడ వరకూ పాకుతుంది.
  • ఆకస్మిక మైకం, వికారంగా అనిపించడం
  • శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది
  • ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఎదురువుతుంది.
  • ఛాతీలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి, ఎడమ దవడ, కుడి చేతి వరకూ నొప్పి వ్యాపిస్తుంది

నివారణ చర్యలు..

షుగర్‌, కొలెస్ట్రాల్‌ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అల్రెడీ షుగర్‌ ఉన్న వాళ్లు.. తీపి పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి. అలాగే సరైన మందులు వాడి, షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇక సిగరేట్లు, బీడీలు తాగే వాళ్లు ఆ అలవాటు మానుకోవాలి. గుండెపోటుకు ప్రధాన కారణమైన ధూమపానం మానేస్తే బీపీ, గుండె సంబంధ వ్యాధులు దరిచేరవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మంచి ఆహారపు అలవాట్లతో పాటు.. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు లేదా వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం, పనితీరు పెరిగి గుండె ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు. ప్రతి రోజూ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, నట్స్, డ్రై ఫ్రూట్స్, మొలకలు వంటి వాటిని తీసుకోవడం ఉత్తమం.

అలాగే.. ఫాస్ట్ ఫుడ్స్, కూల్‌డ్రింగ్స్‌, కేలరీలు ఎక్కువగా, పోషకాహారం తక్కువ వంటి వాటిని వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది. వృత్తిపరమైన, వ్యక్తిగత ఒత్తిళ్లు తగ్గించుకుంటూ.. ఓవర్‌ థికింగ్‌ చేయడం మానేయాలి. ప్రతి విషయానికి ఎక్కువ కంగారు పడొద్దు. రోజులో కనీసం 7 నుంచి 8 గంటల పాటు సుఖమైన నిద్ర పొందాలి. ప్రశాంతమైన నిద్రతో గుండె పోటు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు. వేరుశెనగ నూనె, కొబ్బరి నూనెలను తగిన మోతాదులో తీసుకుంటూ ఉంటాలి. రెడ్‌ మీట్‌.. అంటే బీఫ్‌(గొడ్డు, ఆవు మాంసం), పోర్క్‌(పంది మాంసం), మటన్‌ వంటి వాటిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

గుండెపోటుకి నెల ముందు కనిపించే సంకేతాలు..

గుండెపోటుకు గురయ్యే ఒక నెల ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అవి గుండెపోటు రాకకు ఒక నెల ముందు కనిపించే లక్షణాలు.. ఛాతీలో నొప్పి రావడం, ఛాతీ భారంగా అనిపించడం, గుండె దడ, సరిగ్గా ఊపిరి అందకపోవడం, అంటే ఊపరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, ఛాతీలో మండుతున్నట్లు, ఏ పనిచేయకపోయినా అలసటగా అనిపించడం, నిద్రలేమి సమ్యసతో ఇబ్బంది పడుతుంటే.. ఇవి గుండెపోటుకు సంకేతాలుగా భావించి.. ముందస్తుగా డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది.

గుండెపోటు మగవారిలో ఒకలా, ఆడవారిలో ఒకలా!

గుండెపోటు అందరిలోనూ ఒక విధంగా రాదు. సాధారణంగా మగవారిలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. కానీ, ఆడవారిలో వయసు పైబడిన వారికి మాత్రమే హార్ట్‌ఎటాక్‌ వస్తుంది. ఆడవారిలో గుండెపోటుకు బీపీ, ధూమపానం, ఒత్తిడి వంటివి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. అలాగే కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా మహిళ‍ల్లో ఎక్కువ. మగవారికి గుండెపోటు ఎప్పుడైనా రావొచ్చు కానీ, ఆడవారికి ఎక్కువగా విశ్రాంతి తీసుకునేటప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు వస్తుందని అధ్యాయనాలు చెబుతున్నాయి. పురుషుల్లో గుండెపోటు సంభవించినప్పుడు తీవ్రమైన ఛాతీ నొప్పి ఉంటుంది. కానీ స్త్రీలలో ఛాతీ ఒత్తిడికి గురవుతుంది, దాంతో పాటు వికారం, చెమట, వాంతులు, మెడ, దవడ, గొంతు, పొత్తికడుపు లేదా వెనుక నొప్పిని కూడా ఉంటుంది. గుండెపోటు వచ్చిన సమయంలో సాధారణంగా ఎవరికైనా ఛాతీలో నొప్పి వస్తుంది. పురుషుల్లో ఛాతీ నొప్పితో పాటు ఎడమ చేతిలో నొప్పిని అనుభవిస్తారు, మహిళలు రెండు చేతుల్లోనూ నొప్పిని అనుభవిస్తారు.

వ్యాధి నిర్ధారణ

కరోనరీ కంప్యూటెడ్ టోమోగ్రాఫిక్ యాంజియోగ్రఫీ(CCTA)తో ఛాతీ నొప్పి లక్షణాలను కలిగి ఉన్న 65 ఏళ్లలోపు మహిళలల్లో రోగనిర్ధారణ జరుపుతారు. ఒక వేళ గుండెపోటు సంభవిస్తే.. పురుషుల కంటే మహిళలు త్వరగా చనిపోయే ప్రమాదం ఉంది. గుండెపోటు వచ్చిన 30 నుంచి 5 ఏళ్లలోపు ఎక్కువగా మహిళలే మరణిస్తారు. గుండెపోటు తర్వాత మహిళలకు మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

హార్ట్‌ ఎటాక్‌, కార్డియాక్‌ అరెస్ట్‌ మధ్య తేడా..

చాలామంది హార్ట్‌ఎటాక్‌(గుండెపోటు), కార్డియాన్‌ అరెస్ట్‌ రెండు ఒకటే అనుకుంటారు. కానీ, రెండు వేరువేరు. అయితే.. అవి రెండు ప్రాణాంతకమైనవే.

హార్ట్‌ ఎటాక్‌ vs కార్డియాక్ అరెస్ట్

హార్ట్‌ ఎటాక్‌: కరోనరీ ఆర్టరీ బ్లాక్‌తో గుండెపోటు సంభవిస్తుంది. గుండెకు రక్తం సరఫరా జరిగే నాళాలు ముసుకుపోతుంటే.. గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని నిలిపివేస్తుంది. దాంతో మన శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. మెల్లమెల్లగా గుండె కణాలు నశిస్తూ ఉంటాయి. దాంతో ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం, బలహీనత, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలతో గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చినా.. గుండె కొట్టుకోవడం కొనసాగుతుంది.

కార్డియాక్ అరెస్ట్: గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోవడాన్ని కార్డియాక్‌ అరెస్ట్‌ అంటారు. ఇది సాధారణంగా గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్య కారణంగా సంభవిస్తుంది. గుండెపై ఉండే నాడీ వ్యవస్థ విద్యుత్‌ షాక్‌ కొట్టినట్లు కొట్టుకోవడంతోనే గుండె కొట్టుకుంటుంది. అంటే గుండె చుట్టూ ఉంటే నాడీ వ్యవస్థ గుండెకు కరెంట్‌ షాక్‌ ఇచ్చినట్లు ఇస్తూ ఉంటాయి.. అందుకే గుండె కొంటుకుంటూ బ్లడ్‌ను పంప్‌ చేస్తుంది. గుండెపై ఉండే నాడీ వ్యవస్థ పనిచేయడం మానేస్తే గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ సమయంలో ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, తల తిరగడం, తలతిరగడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తే.. వ్యక్తి మూర్ఛపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరుగుతుంటుంది. ఆ సమయంలో పల్స్‌ని గుర్తించే వీలుండదు. ఇలాంటి సమయంలో CPR చేసి గుండె మళ్లీ కొట్టుకునేలా చేసి.. వారి ప్రాణాలు నిలబెట్టవచ్చు.

మినీ హార్ట్‌ ఎటాక్‌ లక్షణాలు..

గుండెపోటులో మినీ హార్ట్‌ఎటాక్‌ అని కూడా ఉంటుంది. ఇది వచ్చినట్లు కూడా బాధితులకు అర్థం కాదు. కానీ, ఛాతీ నొప్పి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది. ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం వంటి లక్షణాలు లైట్‌ అనిపిస్తాయి.

గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌-గుండె నొప్పికి తేడా..

గుండె నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పి దాదాపు ఒకేలా ఉంటాయి. దీంతో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా అది గుండె నొప్పి అని చాలా కంగారు పడుతుంటారు. అలాగే నిజంగా గుండె నొప్పి వచ్చినా.. గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లమ్‌ అనుకొని లైట్‌ తీసుకుంటూ సరైన జాగ్రత్తలు పట్టించకుండా ప్రాణాలు కోల్పోతుంటారు. అందుకే ఈ రెండు నొప్పుల మధ్య తేడా తెలుసుకోవడం ఎంతో అవసరం. గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట. ఛాతీలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి వెన్నెముక వైపుగా వ్యాపిస్తుంది. గొంతులో మంట, కడుపు, ఛాతీ భాగంలో మండినట్లు అనిపించడం, తెన్పులు రావడం. ఇవి గ్యాస్ట్రిక్‌ నొప్పి వల్ల కలిగే ఇబ్బందులు.

వైద్య పరీక్షలు..

సాధారణంగా 30 శాతానికి పైగా గుండెపోటులు ఈసీజీ పరీక్షల ద్వారానే నిర్ధారిస్తారు. వీటితో పాటు ల్యాబ్‌ పరీక్షలైన.. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, సి-రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్‌, కార్డియాక్ ట్రోపోనిన్‌లు, క్రియేటిన్ కినేస్ (CK), మయోగ్లోబిన్. ఇమేజింగ్ టెస్ట్‌లు.. ఎలక్ట్రో కార్డియోగ్రామ్(EKG/ECG), అంబులేటరీ EKG, ఎకోకార్డియోగ్రఫీ, కరోటిడ్ అల్ట్రాసౌండ్, కార్డియాక్ CT, కరోనరీ యాంజియోగ్రఫీ, కార్డియాక్ కాథెటరైజేషన్, ట్రాన్సోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ (TEE), TMT అనే టెస్టులతో గుండెపోటును గుర్తిస్తారు. వీటిలో కొన్ని పరీక్షలు ముందస్తుగా చేయించుకొని.. గుండెపోటు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు.. అంటే సరైన ఆహారం, జీవిన విధానంలో మార్పులు వంటివి చేసుకోవచ్చు.

(గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అందింజేసిన సమాచారం. మీకు ఎలాంటి లక్షణాలు కనిపించినా, మీకు టైఫాయిడ్ సోకిందనే అనుమానం ఉన్నా కూడా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్సను తీసుకోవాల్సి ఉంటుంది.)
Show comments