తాను జబ్బు పడ్డానని అతి త్వరలో కోలుకుని ఆరోగ్యంగా బయటికి వస్తానని రెండు రోజుల క్రితం సమంతా పెట్టిన ట్వీట్ మీద పరిశ్రమలో చర్చ జరుగుతూనే ఉంది. ఫామ్ లో ఉన్న యంగ్ హీరోయిన్ కి ఇలా జరగడం అరుదు. వయసయ్యాక ఏవైనా సమస్యలు వస్తే సహజం కానీ సామ్ విషయంలో అది కారణం కాదు కాబట్టే ఇంత డిస్కషన్. ఎంత విడాకులు తీసుకున్నా నాగచైతన్య తన మాజీ భర్తే కనక పరామర్శకు ఆసుపత్రికి వచ్చి వెళ్లాడా లేదా అనే కోణంలో అభిమానులు ఫోటోలు వీడియోలు ఏమైనా వస్తాయేమోన ని ఎదురు చూస్తున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదని తెలిసింది. నాగార్జున వాకబు చేశారు కానీ నేరుగా వెళ్లలేదని వినికిడి.
ఇక విషయానికి వస్తే వచ్చే ఈ నెల 11న సామ్ కొత్త సినిమా యశోద విడుదల కానుంది. తనదే టైటిల్ రోల్. క్యాస్టింగ్ పరంగా ఇంకెలాంటి ఆకర్షణలు లేవు. సామ్ పేరు మీద మార్కెటింగ్ గట్రా చేసుకోవాలి. కానీ వచ్చే పరిస్థితి లేదు. చేతిలో ఉన్నది తొమ్మిది రోజులు. ఇంత తక్కువ గ్యాప్ లో హైప్ ని పెంచడం అంటే సవాలే. కేవలం సానుభూతి ఓపెనింగ్స్ తెస్తుందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కంటెంట్ బలంగా ఉంటే ఇదేం పెద్ద ఇబ్బంది కాదు కానీ లేదూ ఏ మాత్రం అటుఇటు ఉన్నా వసూళ్లలో పబ్లిసిటీ కీలక పాత్ర పోషిస్తుంది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ యశోదని భారీ బడ్జెట్ తో నిర్మించారు. బిజినెస్ కూడా మంచి ఆఫర్లతో ముగిసింది.
గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. కూలి షూటింగ్ సందర్భంగా అమితాబ్ బచ్చన్ గాయపడినప్పుడు దేశంమొత్తం ప్రార్ధనలు చేశారు. ఆయన కోలుకున్నారు. ఆ చిత్రం రిలీజయ్యాక వచ్చిన ఓపెనింగ్స్ కి ట్రేడ్ షాక్ తింది. రికార్డులు నమోదయ్యాయి. సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ జరిగి ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో రిపబ్లిక్ వచ్చింది. కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదు. మెయిన్ ఫేస్ అయిన సమంతా లేకుండా యశోదను జనంలో తీసుకెళ్లడం కొంత కష్టమే. కృత్రిమ గర్భధారణ పేరుతో మెడికల్ మాఫియా చేసే ఆగడాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. మణిశర్మ సంగీతం మీద మంచి అంచనాలున్నాయి.