సుప్రీంకోర్టు 50వ చీఫ్ జస్టిస్ గా చంద్రచూడ్..

  • Published - 01:45 PM, Wed - 9 November 22
సుప్రీంకోర్టు 50వ చీఫ్ జస్టిస్ గా చంద్రచూడ్..

భారత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన స్వతంత్ర భారత దేశంలో 50వ భారత ప్రధాన న్యాయమూర్తి. ఆయన పూర్తి పేరు ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఇవాళ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో పాటు వీఐపీలు హాజరయ్యారు.

సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న డీవై చంద్రచూడ్ ను పదవీ విరమణ చేసిన సీజేఐ యూయూ లలిత్ సిఫార్సు చేశారు. దీనికి కొలీజియంతో పాటు కేంద్రం కూడా ఆమోదముద్ర వేయడంతో ఇవాళ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టారు. చంద్రచూడ్ రెండేళ్లకు పైగా ఛీఫ్ జస్టిస్ గా పనిచేయబోతున్నారు. చంద్రచూడ్ 2024 నవంబర్ 10 వరకూ పదవిలో ఉంటారు. ఈ మధ్యకాలంలో రెండేళ్ల పదవీకాలం దక్కిన ఛీఫ్ జస్టిస్ కూడా ఆయనే.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడే డీవై చంద్రచూడ్. ఆయన తండ్రి వైవీ చంద్రచూడ్ సుప్రీంకోర్టులో గరిష్టంగా ఏడేళ్ల సుదీర్ఘ కాలం సీజేఐగా పనిచేసిన రికార్డు కూడా ఉంది. అంతే కాదు డీవై చంద్రచూడ్ ఇప్పటికే సుప్రీంకోర్టులో గత రెండేళ్లుగా ఎన్నో కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇందులో అయోధ్య తీర్పుతో పాటు పలు కీలక తీర్పులు ఉన్నాయి. అలాగే ఆయన తండ్రి గతంలో ఇచ్చిన రెండు తీర్పుల్ని తిరగ రాసిన చరిత్ర కూడా డీవై చంద్రచూడ్ కు సొంతం.

Show comments