స్టార్ ఎవరనేది నార్త్ ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ప్రమోషన్లు చేస్తున్న టైంలో ఫలానా సినిమా తమకు ఆసక్తికరంగా అనిపిస్తుందా లేక ఖచ్చితంగా థియేటర్లలోనే చూడాలనిపించే ఫీలింగ్ కలుగుతోందానేది చెక్ చేసుకుని మరీ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అందుకే తాజాగా విడుదలైన బాలీవుడ్ కొత్త సినిమాల్లో దేనికీ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. అందులో థాంక్ గాడ్ ఉంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందిన ఈ ఫాంటసీ డ్రామాకు ఇంద్ర కుమార్ దర్శకుడు. ఈయన పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ. 90 దశకంలో తేజాబ్, దిల్, బేటా, ఇష్క్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సీనియరాయన. బాగా గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చారు
మాములుగా యముడు ప్రధాన పాత్రల్లో ఎన్ని సినిమాలు వచ్చాయంటే లెక్క బెట్టడం కష్టం. దేవాంతకుడు, యమగోల, యముడికి మొగుడు, యమదొంగ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వచ్చాయి. అదే పాయింట్ ని తీసుకుని ఈసారి వెరైటీగా చిత్రగుప్తుడిని హైలైట్ చేసే ఉద్దేశంతో ఇంద్ర కుమార్ కథను రాసుకున్నారు. ఎన్నో తప్పులు చేసి బిజినెస్ లో కోట్లు నష్టపోయి చివరికి యాక్సిడెంట్ లో చావు దాకా వెళ్లొచ్చిన ఓ వ్యాపారవేత్తకు యమలోకంలో వాటికి సరిద్దిద్దుకునే ఆఫర్ తో మరోసారి కిందికొచ్చే అవకాశం దక్కుతుంది. అప్పుడతను ఏం చేశాడు, పుణ్యాలు ఎలా పెంచుకున్నాడనేదే అసలు స్టోరీ. ఆ మధ్య వచ్చిన నాగ చైతన్య థాంక్ యు గుర్తొస్తే మీ తప్పు కాదు.
ఇదొక్కటే కాదు ఇంకా చాలా రిఫరెన్సులు వాడేశారు. వెంకటేష్ విశ్వక్ ల ఓరి దేవుడాలో కొంత, సముతిరఖని సెల్ఫ్ డైరెక్షన్ లో వచ్చిన వినోదయ సితం(పవన్ కళ్యాణ్ తో రీమేక్ ప్రతిపాదన ఉంది)తాలూకు పోలికలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. లైన్ ఓకే అనిపించినా అసలైన టేకింగ్ లో ఇంద్రకుమార్ మరీ బిసి కాలం నాటి ఫార్మాట్ ని ఎంచుకోవడంతో థాంక్ గాడ్ ఏ దశలోనూ ఆసక్తికరంగా సాగదు. చాలా సన్నివేశాలు లాజిక్ కి దూరంగా సాగుతాయి. ఓ మై గాడ్(గోపాల గోపాల) హిట్టయ్యిందనే ఉద్దేశంతో ఆ టైపులో అదే జానర్ ని టచ్ చేసి కంబ్యాక్ ఇవ్వాలనుకున్న ఇంద్రకుమార్ ఉద్దేశం నెరవేరలేదు. అజయ్ దేవగన్ వీరాభిమానులకు సైతం ఇది నచ్చడం కష్టమే.