ఇటీవలి కాలంలో ఓటిటిలు వెబ్ సిరీస్ లతో పాటు ప్రత్యేకంగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ మొదటిసారి తెలుగులో స్ట్రెయిట్ గా తీసిన మూవీ అమ్ము. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ 1లో కీలక పాత్ర పోషించిన ఐశ్వర్య లక్ష్మి టైటిల్ పాత్ర పోషించగా డిజిటల్ విప్లవం ఊపందుకున్నాక బిజీ స్టార్ గా మారిపోయిన నవీన్ చంద్ర ఆమె భర్తగా నటించాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ చేయడంతో పాటు 37 లాంగ్వేజస్ తో సబ్ టైటిల్స్ ఇవ్వడం విశేషం. సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేసుకున్న ఈ మూవీ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం
సిఐగా ఉద్యోగం వచ్చిన రవీంద్ర(నవీన్ చంద్ర)తన పొరుగునే ఉన్న చిన్ననాటి స్నేహితురాలు అమ్ము(ఐశ్వర్య లక్ష్మి)ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. మొదట్లో బాగానే ఉన్న ఇతగాడు ఆ తర్వాత తనలో సైకో లక్షణాలు బయటికి తీసి అమ్ముని సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెడతాడు. ముందు ఓపిగ్గా భరించిన అమ్ము ఆ తర్వాత తట్టుకోలేక అతని పైఅధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధ పడుతుంది. ఇది పసిగట్టిన భర్త తెలివిగా దాన్ని జరక్కుండా ఆపుతాడు. మొగుడి నిజస్వరూపాన్ని ప్రపంచానికి చెప్పేందుకు బెయిలు మీద బయటికి వచ్చిన ప్రభుదాస్(బాబీ సింహ)సహాయం తీసుకుంటుంది. ఆ తర్వాత జరిగేదే అమ్ములోని అసలైన స్టోరీ.
లైన్ పరంగా ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన డార్లింగ్స్, తాప్సీ ధప్పడ్ ఛాయలు కనిపించినప్పటికీ అమ్ముని చారుకేష్ శేఖర్ వాటిలో ఉన్న సందేశాన్నే ఇందులో చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇంటరెస్టింగ్ పాయింట్ తీసుకున్న శేఖర్ దాన్ని పూర్తి స్థాయి ఎంగేజింగ్ గా మలచకలేకపోయారు. అసలు ప్లాట్ లోకి ఎంటరయ్యేంత వరకు రవీంద్ర శాడిజం కోసం తీసుకున్న లెన్త్ ఎక్కువైపోయి బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. భర్తకు కనువిప్పు కలిగించే క్రమంలో కొంత డ్రామా ఎక్కువై పోవడంతో సహజత్వం తగ్గింది. కొన్ని లాజిక్స్ సైతం వదిలేశారు. ఆర్టిస్టులు పెరఫార్మెన్స్ బలంగా నిలిచిన అమ్మని అక్కడక్కడా ఫార్వార్డ్ చేసుకుంటూ వన్ టైం వాచ్ గా పెట్టుకోవచ్చు