బహుశా 2023 సంక్రాంతి గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని టఫ్ ఫైట్ చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి బాలకృష్ణ ప్రభాస్ విజయ్ ల పోటీతో థియేటర్లు ఎలా సర్దుబాటు జరుగుతాయోనని టెన్షన్ పడుతుంటే తాజాగా అజిత్ తునివుని సైతం పొంగల్ కే లాక్ చేస్తూ నిర్మాత బోనీ కపూర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. వారసుడుని ఢీ కొంటామని స్పష్టంగా చెప్పేశారు. మొత్తం అయిదు సినిమాల మోతతో పండగ రచ్చ మాములుగా ఉండేలా లేదు. మరోవైపు ఏజెంట్ కూడా ఆల్రెడీ అనౌన్స్ మెంట్ ఇచ్చింది కానీ మొదటి ప్యాన్ ఇండియా చేసిన అఖిల్ తో ఎంతమేరకు ఈ పద్మవ్యూహంలో రిస్క్ చేస్తారనేది వేచి చూడాలి.
నిజానికి అజిత్, విజయ్ లు తెలుగు మార్కెట్ ని లైట్ తీసుకుంటున్నారు. మాస్టర్, విజిల్, అదిరిందిలు కమర్షియల్ గా ఎంత పే చేసినా ఇక్కడ స్టార్లతో పోటీ పడేంత సీన్ విజయ్ కింకా రాలేదు. అది నిర్మాత దిల్ రాజుకు తెలుసు. అందుకే స్ట్రెయిట్ తమిళ వెర్షన్ గా తీసి టాలీవుడ్ లో కేవలం డబ్బింగ్ చేసి వదులుతున్నారు. ఇక్కడ పెద్దగా ఆడకపోయినా వచ్చే నష్టమేమి లేదు. ఎటొచ్చి దానివల్లే మనకు కొన్ని థియేటర్లు తగ్గడం తప్ప. ఇక అజిత్ ఎప్పుడో ఏపి తెలంగాణలు లైట్ తీసుకున్నాడు. ఎంతగా అంటే వలిమై కనీసం టైటిల్ నైనా అనువదించకుండా నేరుగా రిలీజ్ చేసేంత. అక్కడది ఎన్ని సెన్సేషన్లు చేసినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సోసోగానే ఆడింది.
అసలు సమస్య ఓవర్సీస్ లో వస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 16న అవతార్ 2 ఉంటుంది. ఎంతలేదన్నా కనీసం నెల రోజుల స్ట్రాంగ్ రన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో స్క్రీన్లు తగ్గించడానికి అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోరు. అలాంటప్పుడు అయిదు క్రేజీ సౌత్ మూవీస్ కి థియేటర్లు సర్దాలంటే డిస్ట్రిబ్యూటర్లకు అదో పెద్ద సవాల్ గా మారుతుంది. టాక్ ఏ మాత్రం అటుఇటు అయినా నెత్తి మీద తడిగుడ్డ తప్పదు. పోనీ పోటీ పడుతున్న వాళ్లలో ఎవరైనా చిన్న హీరో ఉంటే లైట్ తీసుకోవచ్చు. కానీ ఆ అవకాశం అసలే లేదు. ఎవరికి వారు తీసిపోని రీతిలో పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్లు. అజిత్ ఎంట్రీతో మరింతగా బిగుసుకుపోయిన ఈ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదిస్తారో చూడాలి.