విజయదశమి రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా?

Dasara Festival: దసరా పండుగ రోజున శమీ పూజ చేస్తారు.. ఆ తర్వాత జమ్మి ఆకులను పంపిణీ చేస్తుంటారు. విజయదశమి సందర్భంగా శమీ పూజ చేయడం వెనుక పురాణాలు ఎన్నో ఉన్నాయి.

Dasara Festival: దసరా పండుగ రోజున శమీ పూజ చేస్తారు.. ఆ తర్వాత జమ్మి ఆకులను పంపిణీ చేస్తుంటారు. విజయదశమి సందర్భంగా శమీ పూజ చేయడం వెనుక పురాణాలు ఎన్నో ఉన్నాయి.

దసరా పండుగ రోజున దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తారు. కొత్త బట్టలు ధరించి సాయంత్రం వేళ జమ్మి చెట్టు వద్దకు వెళ్తారు. పూజారి సమక్షంలో జమ్మి చట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకుంటారు. పాలపిట్ట దర్శనం తర్వాత జమ్మి ఆకులు తెంచి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ఒకరికొకరు జమ్మి ఆకు ఇచ్చుకొని అలాయ్ బలాయ్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలా దసరా పండుగ వాతావరణం ఎంతో సందండిగా ఉంటుంది. విజయదశమి రోజున జమ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారు.. అలా చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటీ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

దసరా అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది జమ్మి చెట్టు. దీనినే శమీ వృక్షం అని కూడా అంటారు. విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజిస్తారు. మహాభారతంలో పాండవులు అజ్ఞాత వాసంలో ఉన్న సమయంలో తమ ఆయుధాలు ఎవరి కంట పడకుండా జాగ్రత్తగా కాపాడమని జమ్మి వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారని పండితులు చెబుతున్నారు. త్రేతా యుగంలో శ్రీరాముడు లంకకు వెళ్లే ముందు జమ్మి చెట్టుకు పూజించి వెళ్తాడు. అందుకే రావణుడిపై విజయాన్ని సాధించాడని రామాయణ గాథ చెబుతుంది.  ఈ వృక్షాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. రుగ్వేద కాలం నుంచి జమ్మి చెట్టు ప్రస్తావన ఉంది. అమృతం కోసం దేవతలు పాల సముద్రాన్ని మథనం చేసినపుడు దేవతా వృక్షాలు వచ్చాయి.. అందులో శమీ వృక్షం కూడా ఒకటని పురాణాలు చెబుతున్నాయి. అప్పట్లో దీన్ని అగ్నిని ఉత్పత్తి చేసే సాధనంగా ఉపయోగించేవారు.. అందుకే ఈ చెట్టుకు అరణి అని పేరు కూడా ఉందని పండితులు చెబుతున్నారు.

జమ్మి చెట్టుకు ఎలా పూజ చేయాలి:

జమ్మి చెట్టు వద్దకు వెళ్లి అక్కడ శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. జమ్మి చెట్టు మొదలు వద్ద మూడు తమలపాకులు ఉంచాలి. ఆ తమలపాకుల్లో మూడు పసుపు ముద్దలు ఉంచాలి. పసుపు ముద్దపై కుడివైపు, ఎడమ వైపు కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ మూడు పసుపు ముద్దలను అక్షింతలు, పూలతో పూజ చేస్తూ ‘ఓం అపరాజితాయై నమః’ అంటూ 21 సార్లు మంత్రం జపించాలి. ఎడమ వైపు ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ‘ఓం జయాయై నమః’ అంటూ 21 సార్లు మంత్రం జపిస్తూ.. అక్షింతలు, పూలు చల్లాలి. ఇక కుడి వైపు ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ‘ఓం విజయాయై నమః’ అంటూ 21 సార్లు అక్షింతలు, పూలు చల్లుతూ మంత్రం జపించాలి. కర్పూర హారతి ఇచ్చి ఒక్కో పసుపు ముద్ద దగ్గర ఒక్కో బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి.

ఆ విధంగా పూజ చేసిన తర్వాత మూడు పసుపు ముద్దలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసుకోవాలి. తర్వాత ఓ తెల్ల కాగితం తీసుకొని పసుపు, కుంకుమ బోట్లు పెట్టి కాగితంపై ఓంకారం, స్వస్తిక్ గుర్తు వేసి కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి జమ్మి చెట్టు తొర్రలో పెట్టాలి. తర్వాత చెట్టు చుట్టూ ప్రదక్షణలు చేసే సమయంలో ‘శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశనమ్.. అర్జునస్య ధనుర్ధారీ.. రామస్య ప్రియదర్శని’ అని చదువుతూ మూడు చదవాలి. ఒకవేళ ఈ శ్లోకం చదవడం రాకుంటే ‘ఓం అపరాజితా దేవ్యై నమః’అనుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల అపరాజితా దేవి అంటే రాజ రాజేశ్వరి దేవి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు తీరిపోతాయని, సకల విజయాలు మీ వెంటే ఉంటాయని పండితులు చెబుతున్నారు. జమ్మి చెట్టు పూజించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయంటారు. ఈ చెట్టు శనితో సంబంధం కలిగి ఉంటుందని.. ఈ చెట్టును పూజించడం వల్ల శనిదోశం పోతుందని అంటారు.జమ్మి గొప్ప ఔషద వృక్షం. జమ్మి చెట్టు ప్రదక్షణలు చేస్తే దాని నుండి వెలువడే గాలికి కొన్ని రోగాలు మటమాయం అవుతాయని అంటారు. జమ్మి పూజిస్తే ఏలిక నాటి శని పోతుందని, గ్రహదోషాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Show comments