Aja Ekadashi 2024: ఈ ఏడాది అజ ఏకాదశి ఎప్పుడు.. పూజా విధానం, విశిష్టత పూర్తి వివరాలు మీ కోసం!

Aja Ekadashi 2024: శ్రావణమాసంలో వచ్చే అజ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. మరి ఈ పర్వదినం నాడు ఏం చేయాలి.. దీని ప్రాధాన్యత ఏంటి, అసలు ఏ రోజు చేసుకోవాలి అనే వివరాలు మీ కోసం..

Aja Ekadashi 2024: శ్రావణమాసంలో వచ్చే అజ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. మరి ఈ పర్వదినం నాడు ఏం చేయాలి.. దీని ప్రాధాన్యత ఏంటి, అసలు ఏ రోజు చేసుకోవాలి అనే వివరాలు మీ కోసం..

హిందూ పంచాగం ప్రకారం.. శ్రావణమాసానికి చాలా విశిష్టత, పవిత్రత ఉంటుంది. ఈ మాసం నుంచే పండగలు, పర్వదినాలు మొదలవుతాయి. ఈ మాసంలోనే వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి వంటి పండుగలు వస్తాయి. ఆ తర్వాత.. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు వరుసగా వస్తాయి. అలానే హిందూ పురాణాల్లో, గ్రంధాల్లో ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి నెలకు రెండు ఏకాదశి తిథిలు వస్తాయి. చాలా మంది ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. అయితే నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు ఉండగా.. వీటిల్లో కొన్నింటికి చాలా విశిష్టత, ప్రాధాన్యత ఉంది. అలాంటి ఓ ఏకాదశినే శ్రావణమాసంలో వస్తుంది. అదే అజ ఏకాదశి. మరి దీని విశిష్టత ఏంటి.. అసలు ఈ ఏకాదశి ఎలా వచ్చింది.. ఈ రోజు ఏ భగవంతుడిని పూజించాలి.. ఆ రోజు ఎలాంటి పనులు చేయాలి.. ఏం చేయకూడదు వంటి వివరాలు మీ కోసం..

పురాణాల ప్రకారం చూసుకుంటే.. అజ ఏకాదశిని శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి వెళ్లిన 4 రోజుల తర్వాత అజ ఏకాదశి వస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఒక వ్యక్తి శారీరక, మానసిక, ఆర్థిక ప్రయోజనాలను కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ పర్వదినాన శ్రీహరిని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల అశ్వమేథ యాగం చేసినంత గొప్ప ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.

ఇక ఈ ఏడాది అజ ఏకాదశి సిద్ధి యోగం, సర్వార్ధ సిద్ధి యోగం వంటి శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. జ్యోతిష్యం ప్రకారం, ఈ రెండు యోగాలు అత్యంత శుభప్రదమైనవి అంటున్నారు పండితులు. ఈ నేపథ్యంలో ఈసారి అజ ఏకాదశి శుభ ముహుర్తం, ఉపవాస దీక్షకు అనుకూల సమయం ఎప్పుడొచ్చిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

అజ ఏకాదశి ఎప్పుడంటే..

ఈ ఏడాది అజ ఏకాదశి తిథి ఆగస్టు 28నా, 29నా అనే అనుమానం చాలా మందిలో ఉంది. కానీ పండితులు మాత్రం.. అజ ఏకాదశి ఆగస్టు 29న వచ్చింది అన్నారు. ఆగస్టు 29 గురువారం అర్ధరాత్రి 1:20 గంటలకు అజ ఏకాదశి తిథి ప్రారంభం అవుతుంది. కనుక ఉదయం తిథి ప్రకారం, ఆగస్టు 29వ తేదీన గురువారం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని చెబుతున్నారు. అలానే 30 ఆగస్టు 2024, శుక్రవారం మధ్యాహ్నం 1:38 గంటలకు ఈ తిథి ముగుస్తుంది.

ఇక చాలా మంది ఏకాదశి నాడు వ్రతం ఆచరిస్తారు. అలా ఈ అజ ఏకాదశి నాడు.. వ్రతం ఆచరించే వారు.. ఆగస్టు 30, శుక్రవారం ఉదయం 7:34 గంటల-ఉదయం 9:10 గంటల మధ్య విరమించాలి. ఇక ఈ ఏడాది అజ ఏకాదశి నాడు.. రెండు యోగాలు ఏర్పడ్డాయి అని పండితులు చెబుతున్నారు కదా. వాటిలో ఒకటైన సిద్ధయోగం 29న ఉదయం నుంచి సాయంత్రం 6:18 గంటల వరకు ఉండనుంది అంటున్నారు. అలానే సర్వార్ధ సిద్ధి యోగం ఆగస్టు 29న గురువారం సాయంత్రం 4:39 గంటల నుంచి మరుసటి రోజు అనగా శనివారం ఉదయం 5:58 గంటల వరకు కొనసాగుతుంది.

పూజా విధానం..

  • అజ ఏకాదశి పర్వదినం రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, తలస్నానం చేయాలి.
  • మీ ఇంట్లో పూజా మందిరంలో శ్రీమహావిష్ణువు విగ్రహం లేదా ఫొటోను ఉంచి, పువ్వులతో అలంకరించాలి. అనంతరం దీపం వెలిగించాలి.
  • శ్రీ హరిని ఆరాధించడానికి ముందు పండ్లను సమర్పించాలి.
  • పూజా సమయంలో లక్ష్మీదేవి వ్రత కథను చదవాలి.
  • ఆ తర్వాత చివరగా హారతి ఇచ్చి ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి.

విశిష్టత..

పురాణాల ప్రకారం, అజ ఏకాదశి అనే పేరును శ్రీ కృష్ణుడే పెట్టారని ప్రతీతి. యుధిష్టరుని అభ్యర్థన మేరకు శ్రావణ మాసం క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి అజ ఏకాదశి అని శ్రీకృష్ణుడు పేరు పెట్టాడు. ఇక ఈ వ్రతాన్ని రాజా హరిశ్చంద్రుడు ఆయన భార్య సత్యవతి ఆచరించారు. హరిశ్చంద్రుడు స్మశాన వాటికలను చూసుకునేవాడు. ఓ సమయంలో అనుకోని విపత్తులు వచ్చి రాజు గారి రాజ్యంలో విపరీతమైన సంక్షోభం నెలకొంది. తన కుమారుడు పాము కాటుకు గురై చనిపోయాడు. తన భార్య కుమారుడని అంత్యక్రియల కోసం తీసుకొచ్చినప్పుడు తన విధిని నిర్వర్తించాడు. ఆ సమయంలో ఆకాశం నుంచి పూల వర్షం కురిసింది.

వాస్తవానికి హరిశ్చంద్రుడు కష్టల్లో ఉండి.. వాటి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నప్పుడు, గౌతమ ముని అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు హరిశ్చంద్రుడు.. ఆ బుుషిని తనకు కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని చెప్పమని కోరతాడు. ఆ సమయంలో శ్రావణ మాసం క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున వ్రతం ఆచరించి, ఉపవాసం ఉండటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. అప్పటినుంచి గౌతమ ముని చెప్పిన విధంగా హరిశ్చంద్ర రాజు అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు.

అజ ఏకాదశి రోజున ఏమి చేయాలంటే

  • అజ ఏకాదశి రోజున ఉదయాన్నే తల స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి.
  • విష్ణువును, తులసి మొక్కను పూజించాలి.
  • విష్ణువు మంత్రాలను జపించాలి.
  • అజ ఏకాదశి కథ వినాలి.
  • ఆహారం, బట్టలు, డబ్బు ఇలా మీకు చేతనైనంత మేర దానం చేయాలి.
  • విష్ణువుని కీర్తిస్తూ భజన చేయాలి.
  • అజ ఏకాదశి నాడు పండ్లు, కూరగాయలు, పాలు వంటి సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి అని పండితులు సూచిస్తున్నారు.

ఏం చేయకూడదంటే..

  • ఉపవాసం ఉండాలి కనుక ఆహారం తీసుకోకూడదు.
  • అధిక శారీరక శ్రమకు దూరంగా ఉండాలి.
  • వినోదానికి దూరంగా ఉండాలి.
  • కోపం, ఆగ్రహానికి దూరంగా ఉండాలి. హింసకు పాల్పడవద్దు.
  • మాంసం, చేపలు, గుడ్లు మొదలైన వాటిని తీసుకోకూడదు.
  • మద్యం, మత్తు పదార్థాలు సేవించకూడదు అని చెబుతున్నారు పండితులు.

గమనిక: ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని ‘‘ఐడ్రీమ్‌ మీడియా’’ నిర్ధారించలేదు.

Show comments