Dharani
Dharani
ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెరపుతోంది. వద్దని భర్త మందలించాడు. అతడి మాటలు వినకపోగా.. భర్త ఎప్పటికైనా తనకు అడ్డే అని భావించి.. మరో మహిళతో కలిసి అతడిని అంతమొందించింది. అయితే పోలీసులకు చిక్కడంతో.. వారు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కొన్ని రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చింది. ప్రతి రోజు స్టేషన్‌కి వెళ్లి సంతకం పెట్టి వస్తుంది. బుధవారం కూడా అదే జరిగింది. సంతకం పెట్టి వచ్చిన కాసేపటికే ఆమె చెరువు కట్ట వద్ద విగత జీవిలా పడి ఉంది. బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి.. ఇంత దారుణంగా హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు..
ఈ దారుణ సంఘటన హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కట్ట మైసమ్మ ఆలయం సమీపంలోని బంధం చెరువు కట్టపై మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతురాలిని రేణుక అలియాస్ ధరణిగా గుర్తించారు. హత్య గావించబడిన మహిళ.. భర్తను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లి.. బెయిల్ మీద బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు రేణుకకు ఏడేళ్ల క్రితం సూరారాం విశ్వకర్మ కాలనీకి చెందిన సురేష్‌తో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గత కొంతకాలంగా సురేష్, రేణుక దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో రేణుకకు దుండిగల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో వాచ్మెన్‌గా పని చేసే సాయిబాబతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. సాయిబాబతో సహజీవనం చేస్తోంది రేణుక. ఈ విషయం ఆమె భర్త సురేష్‌కు తెలిసింది. దాంతో అతడు రేణుకను మందలించాడు.. ఆమె తీరు మార్చుకోవాలని సూచించాడు. అయితే సురేష్ మాటలు విన్న రేణుక.. భర్త ఎప్పటికైనా తన బంధానికి అడ్డు పడతాడని భావించి.. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 6న మరో మహిళతో కలిసి భర్త సురేష్‌ని హత్య చేసింది రేణుక. ఈ కేసులో జైలుకెళ్లిన రేణుక కొన్ని రోజుల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చింది.
ప్రతి రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టి వచ్చేది. ఈ క్రమంలో తాజాగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టి.. ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత పని మీద బయటకు వచ్చిన రేణుక దారుణ హత్యకు గురైంది. బంధం చెరుకు కట్ట మీద ఆమెను హత్య చేశారు దుండగులు. డెడ్‌బాడీ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి.. కేసు నమోదు చేశారు. రేణుకు శరీరం మీద గాయలను బట్టీ.. ఆమెది హత్య అని నిర్ధరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. రేణుక కాల్ హిస్టరీ చెక్ చేశారు. దానిలో ఆమె చివరి సారిగా తన భర్త సురేష్ తమ్ముడు నరేష్‌తో మాట్లాడినట్లుగా గుర్తించారు. రేణుక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.