Dharani
Dharani
ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని పదేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పైగా బాలుడి చేతిలో ఓ లేఖ ఉండటం.. దానిలో ఉన్న వ్యాఖ్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలు ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టారు.. పదేళ్ల చిన్నారిపై ఎవరికి ఇంత కక్ష ఉందనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే..
ఏలూరు జిల్లా, ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామం ఉర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డి, రామలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వాలంటీర్‌గా పని చేస్తుండగా.. రామలక్ష్మి ఆశా వర్కర్‌గా పని చేస్తున్నారు. ఇక వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి ఆరో తరగతి చదువుతుండగా.. చిన్న కుమారుడు అఖిల్‌వర్ధన్‌రెడ్డి నాలుగో తరగతి చదువుతూ పులిరాముడుగూడెం, గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటున్నాడు. మరి ఏం జరిగిందో తెలయదు కానీ.. మంగళవారం ఉదయం హాస్టల్ ప్రాంగణంలో అఖిల్ మృతదేహం పడి ఉంది. ఇది గమనించిన హాస్టల్ యజమాన్యం దీని గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అఖిల్‌వర్ధన్ తండ్రి శ్రీనివాసరెడ్డి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక అఖిల్ మృతదేహంపై గాయాలున్నాయని.. బాలుడి పీక నొక్కి ఉండటం, కళ్లపై గుద్దిన గుర్తులున్నాయని కనిపిస్తున్నాయి అని తెలిపారు. ఇక బాలుడి చేతిలో ఓ లేఖను గుర్తించారు పోలీసులు. దానిలో ‘బతకాలనుకున్న వారు వెళ్లిపోండి. ఎందుకంటే.. ఇక నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇట్లు మీ XXX’ అని రాసి ఉంది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్లి.. కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత అఖిల్‌ను ఎత్తుకెళ్లి పథకం ప్రకారం హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇద్దరు వ్యక్తులు హాస్టల్‌కి వచ్చి అఖిల్‌ను ఎత్తుకెళ్లారని ఓ విద్యార్థి పోలీసులకు తెలిపాడు.
అఖిల్ మృతి నేపథ్యంలో.. విద్యార్థుల మధ్య ఏవైనా గొడవ జరిగిందా.. బాలుడి కుటుంబంపై ఎవరైనా కక్ష పెట్టుకుని హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలో వాచ్‌మన్ విధుల్లో లేరని ఆరోపిస్తుంటే.. తాను బిల్డింగ్‌లో ఓ గదిలో నిద్రపోతున్నట్లు తెలిపాడు. అంతేకాక అక్కడ ఉన్న సోలార్ లైట్ పని చేయడం లేదని.. సమాచారం. ఈ దారుణం నేపథ్యంలో పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ పాఠశాల హెడ్‌మాస్టర్, డిప్యూటీ వార్డెన్, నైట్ వాచ్‌మన్‌లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ట్రిపులెక్స్ ఎవరనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.