P Krishna
P Krishna
దేశ వ్యాప్తంగా గణేశ్ చతుర్థి నవరాత్రులు పూజలు పూర్తయ్యాయి. అంతరంగ వైభవంగా గణేశుడి శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. డీజే సౌండ్స్, డ్యాన్సులులతో బొజ్జగణపయ్య నిమజ్జనం కొనసాగుతున్న సమయంలో అక్కడక్కడ అపశృతులు జరుగుతున్నాయి. నగరంలో వినాయక నిమజ్జన సమయంలో అపశృతి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో గణేష్ శోభయాత్ర, నిమజ్జనోత్సవం సందడిగా మొదలైంది. ఖైరతాబాద్ వినాయకుడు సహా.. నగరంలోని వేల కొద్ది వినాయక విగ్రహాలు నేడు నిమజ్జనం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. చిన్నా, పెద్దా లక్షల మంది నిమజ్జనోత్సవం వేడుకలు చూడటానికి విచ్చేస్తున్నారు. జై బోలో గణపతి మారాజ్ కి జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హూరెత్తిస్తున్నారు. అయితే నిమజ్జన వేడుకలో కొన్ని చోట్ల అపశృతులు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో నిమజ్జన సమయంలోకొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎస్పీఆర్ హిల్స్ ప్రతిభా నగర్ కి దివ్యాంగుల కాలనీకి చెందిన ఇప్పల దుర్గేశ్ (22) జీహెచ్ఎంసీ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పాత బస్తీలో అమ్మమ్మ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జనానికి వెళ్లాడు. ట్యాంక్ బండ్ పక్కన ఉన్న అమరవీరులు జ్యోతి సమీపంలో వాహనంపై నుంచి దుర్గేశ్ పడిపోయాడు. వెనుక నుంచి వస్తున్న వాహనం అతడిపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడే మరణించాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.