iDreamPost
android-app
ios-app

అందంగా ఉందని మాట కలిపారో అంతే.. పెళ్లికాని మగాళ్లే టార్గెట్..

అందాన్నే పెట్టుబడిగా మార్చుకుంది కోమలి. 40 ఏళ్లు దాటినా కూడా గ్లామరస్ ఫోటోలతో పెళ్లి కాని ప్రసాదులను టార్గెట్ చేసేది. నిత్యం వారితో చాట్ చేసేది. ఆమె మాయలో పడ్డారో..

అందాన్నే పెట్టుబడిగా మార్చుకుంది కోమలి. 40 ఏళ్లు దాటినా కూడా గ్లామరస్ ఫోటోలతో పెళ్లి కాని ప్రసాదులను టార్గెట్ చేసేది. నిత్యం వారితో చాట్ చేసేది. ఆమె మాయలో పడ్డారో..

అందంగా ఉందని మాట కలిపారో అంతే.. పెళ్లికాని మగాళ్లే టార్గెట్..

ఈ రోజుల్లో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం చాలా కష్టంగా మారింది. ఆడ పిల్లలు, వారి తల్లిదండ్రుల ఎక్స్ పర్టేషన్స్ వేరేలా ఉండటంతో యువకులకు వివాహాలు కావడం లేదు. దీంతో ఆడ పిల్లలు దొరక్క..ఎన్నో మ్యాట్రిమోనీలను సంప్రదిస్తున్నారు. దీన్నే క్యాష్ చేసుకుందో మహిళ. అందాన్ని పెట్టుబడిగా పెట్టి.. మ్యాట్రిమోనీలో దరఖాస్తు చేసుకున్న పురుషులను టార్గెట్ చేసింది. వారితో పరిచయం పెంచుకుని.. మాటలు కలిపేది. ఇక ఆమె మాయలో పడ్డారో మటాషే. రెండు, మూడు నెలల పాటు ఎటువంటి అనుమానం లేకుండా చాట్ చేసేది.  అవసరమైతే పెళ్లి చేసుకుని సంసారం సాగించేది. అలా ఎంతో మంది జీవితాలతో ఆటలాడిందా మహిళ. చివరకు వగలాడి చేతిలో బాధితుడైన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ క్రైమ్ వెలుగులోకి వచ్చింది.

భర్త చనిపోయి ఒంటరితనంతో ఉన్న ఓ మహిళ.. జల్సాలకు అలవాటు పడి.. మగవాళ్లకు పెళ్లి వల వేసి డబ్బులు దోచుకున్న ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో చోటుచేసుకుంది. నిందితురాల్ని కోమలగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోమలకు KPTCL ఉద్యోగితో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త 2017లో మరణించారు. అప్పటి నుండి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. ఈజీ మనీ కోసం తన అందాన్ని పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేసింది. మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయిన పురుషులకు వల వేసేది. మారు పేర్లతో పరిచయం చేసుకుని, పెళ్లి పేరుతో నిత్యం చాట్ చేసేది. మరికొంత మందితో వితంతువుని, రెండో పెళ్లి చేసుకునేందుకు భర్త చేసిన అప్పులు తానే తీర్చాలని లేకపోతే అతడి నుండి ఆస్తులు రావాలంటూ పురుషుల్ని మభ్యపెట్టేది.

తాజాగా చిక్కబళ్లాపూర్ జిల్లా గౌరిబిదనూరుకు చెందిన రాఘవేంద్రను మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయం పెంచుకుంది. తన భర్త చనిపోయాడని, అతడి నుండి రూ. 6 కోట్లు ఆస్తులు తనకు రావాలని, అందుకు డబ్బులు అవసరం అంటూ నమ్మబలికింది. నిజమేనని నమ్మిన రాఘవేంద్ర రూ. 7.40 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత నుండి అతడి ఫోన్ బ్లాక్ చేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలు కోమలను అరెస్టు చేశారు. ఆమె దగ్గర నుండి యాపిల్ ఫోన్, యాపిల్ వాచ్, రూ. 20, 940 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆమె అరెస్టుతో పలు మోసాలు బయటకు వచ్చాయి. బెంగళూరుకు చెందిన నాగరాజ్ అనే వ్యక్తి నుండి రూ. లక్షా 50 వేలు తీసుకున్నట్లు తేలింది. తావెరగెరకు చెందిన మధుతో వివాహమైన రెండు నెలలకే 70 వేల విలువైన బంగారంతో ఉడాయించింది.