రాజకీయ పగ.. ఇంట్లోకి చొరబడి ఇద్దరు బాలికలపై దారుణం!

రాజకీయ కక్షతో ఓ ఇద్దరు దుండగులు దారుణానికి యత్నించారు. రాజకీయంగా ఎదుటి వ్యక్తిని ఎదుర్కోలేక పాశవిక చర్యకు పాల్పడ్డారు. తమ రాజకీయ ప్రత్యర్థి ఇంట్లోకి చొరబడి.. అతడి ఇద్దరు కూతుళ్లతో బలవంతంగా విషం తాగించారు. ఈ సంఘటన కర్ణాటకలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు గ్రామాంతర జిల్లాలోని దేవనహళ్లి తాలూకా, దొడ్డసన్న గ్రామానికి చెందిన అశోక్‌ -శిల్పా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు పల్లవి, అనూషలు ఉన్నారు.

అశోక్‌ ఓ రాజకీయ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులతో అతడికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ గొడవలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ వాళ్లు అశోక్‌పై పగ పెంచుకున్నారు. గురువారం ఉదయం ఓ ఇద్దరు వ్యక్తులు అశోక్‌ అతడి భార్య ఇంట్లో లేని సమయంలో లోపలికి చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అనూష, పల్లవిలపై దారుణానికి ఒడిగట్టారు. బలవంతంగా వారితో పురుగుల మందు తాగించారు. తాగకపోతే చంపుతామని బెదిరించి మరీ, వారి చేత పురుగుల మందు తాగించారు.

వారు పురుగుల మందు తాగగానే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ ఇ‍ద్దరు బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంటి బయటకు వచ్చి విషయాన్ని పొరిగింటి వాళ్లకు చెప్పారు. దీంతో వారు బాలికలిద్దర్నీ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉంది. ఇక, ఈ సంఘటనపై అశోక్‌ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమకు అనుమానం ఉన్న వారిపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, రాజకీయ పగ నేపథ్యంలో చిన్నారులకు విషం తాగించిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

Show comments