Dharani
ఓవైపు ఐటీ రంగంలో ఉద్యోగులను బయటకు పంపిస్తుండగా.. ఓ కంపెనీ మాత్రం అందుకు భిన్నంగా 8 నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..
ఓవైపు ఐటీ రంగంలో ఉద్యోగులను బయటకు పంపిస్తుండగా.. ఓ కంపెనీ మాత్రం అందుకు భిన్నంగా 8 నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..
Dharani
ప్రస్తుతం ఉద్యోగుల పరిస్థితి అంత బాగా లేదు. మరీ ముఖ్యంగా.. ఐటీ రంగంలో దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల నుంచి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీల వరకు.. చాలా చోట్ల భారీ ఎత్తున ఉద్యోగులను కూడా తీసేస్తున్నారు. దాంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు ఎంప్లాయిస్. ఇంక్రిమెంట్లు, బోనస్‌లు వంటి వాటి గురించి కూడా ఆలోచించడం లేదు. ఉద్యోగం ఊడకుండ ఉంటే చాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ కంపెనీ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 నెలల జీతాన్ని బోనస్‌గా ప్రకటించింది. ఈ వార్త తెలిసి ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకు ఆ కంపెనీ ఏదంటే..
ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్‌గా ప్రకటించింది ఓ విమానయాన సంస్థ. అది మన దగ్గర కాదు. సింగపూర్‌కు చెందిన కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్‌లైన్స్.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేసింది. ఊహించిన దాని కన్నా భారీ మొత్తంలో లాభాలు రావడంతో.. ఉద్యోగులకు పెద్ద మొత్తంలో బోనస్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దీనిలో భాగంగా తమ సంస్థలో పని చేస్తున్న ఎంప్లాయిస్‌కు 8 నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోతే.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ మాత్రం అందుకు భిన్నంగా భారీ ఎత్తున లాభాలు నమోదు చేసింది.
కోవిడ్ తర్వాత పరిస్థితి మారడం.. చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ దేశాల సరిహద్దులు పూర్తిగా తెరచుకోవడం సంస్థ లాభాల బాట పట్టేందుకు కారణమని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్.. రికార్డు స్థాయిలో అనగా ఏకంగా 1.98 బిలియన్ డాలర్ల వార్షిక నికర లాభాన్ని నమోదు చేసింది. దీంతో మార్చి నెల ముగిసే నాటికి కంపెనీ నికర ఆదాయం 24 శాతం పెరిగి 2. 7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఈ సందర్భంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన చేసింది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన వసతులు కల్పించడంతో పాటు.. ఉద్యోగుల మెరుగైన పనితీరును గుర్తించి.. వారికి సరైన ప్రోత్సాహాకాలు అందిచడం కూడా తమ విధి అని చెప్పుకొచ్చింది. అంతేకాక.. ఉద్యోగుల మెరుగైన పనితీరే ఈ లాభాలకు కారణమని.. కంపెనీ చెప్పుకొచ్చింది. అందుకే లాభాల్లో కొంత భాగాన్ని ఉద్యోగులకు బోనస్ రూపంలో అందించనున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇక ఇలా కంపెనీ లాభాలు గడించి.. దానిలో కొంత భాగం ఉద్యోగులకు బోనస్‌గా ఇవ్వడం ఇదే ప్రథమం కాదు. గతంలో దుబాయ్ ఎమిరేట్స్ కూడా ఇలానే 20 వారాల జీతాన్ని ఉద్యోగులకు బోనస్‌గా అందించింది.