చిన్నారుల భద్రతపై TTD కీలక నిర్ణయం

తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చిన్నారి చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక చిరుత దాడిలో మరణించిన లక్షిత ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అప్రమత్తమైంది. బాధిత కుటుంబానికి టీటీడీ రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా అటవీ శాఖ అధికారుల నుంచి సైతం రూ.5 లక్షలు బాధిత కుటుంబానికి పరిహారాన్ని ఇప్పిస్తామని తెలిపారు. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న నడక దారి భక్తులకు ఎలాంటి రక్షణ లేదని కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

చిన్నారి లక్షిత మరణంపై టీటీడీ విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత తిరుమలకు నడక మార్గంలో వచ్చే 15 ఏళ్ల లోపు పిల్లలకు నో ఎంట్రీ విధించించినట్లు ప్రకటించింది. ఈ ఆంక్షలు సోమవారం నుంచే అమల్లోకి రానున్నాయని తెలిపింది. భక్తుల భద్రత కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మరో విషయం ఏంటంటే? 2వ ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 తర్వాత ద్విచక్రవాహనాలకు నో ఎంట్రీ అని కూడా తెలిపింది.

చిరుత దాడిలో చిన్నారి లక్షిత మరణంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సైతం స్పందించింది. 6 ఏళ్ల చిన్నారి మరణించిన నేపధ్యంలో జరిగిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు టీటీడీ, అటవీ, పోలీస్ శాఖతోపాటు రెవెన్యూ అధికారులకు ఆదేశాలకు జారీ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా తగు రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి.. రూ.10 లక్షల పరిహారం

Show comments