Dharani
Dharani
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు ఎలా తడుతుందో చెప్పడం కష్టం. ఇక ఈ మధ్య కాలంలో చాలా మందికి లాటరీలు తగిలి.. రాత్రికి రాత్రే మిలియనీర్లు, బిలయనీర్లుగా మారిన వార్తలు అనేకం చూశాం. ఇక తాజాగా ఈ కోవకు చెందిన మరో వార్త వెలుగు చూసింది. కాకపోతే ఇక్కడ వారిని అదృష్టం ఇలా పలకరించి అలా వెళ్లిపోయింది. తేనె కోసం వెళ్లిన వారికి.. ఏకంగా బంగారు నాణెలు ఉన్న బిందె దొరికింది. అయితే ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఇంతకు ఏం జరిగింది అంటే..
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టెపల్లికి చెందిన వరుణ్, అజిత్, వెంకటేశ్వర్లు అనే నలుగురు యువకులు తేనె కోసం గ్రామ సమీపంలోని పురాతన అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారికి అక్కడ రాళ్ల కింద ఇత్తడి చెంబు ఒకటి కనిపించింది. అయితే రాళ్లను తొలగించి చెంబును బయటకు తీశారు. ఆ తర్వాత దాన్ని పగులకొట్టి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే.. వారికి ఆ చెంబులో బంగారు నాణేలు కనిపించాయి.
దాంతో యువకులు చెంబును తీసుకుని.. గ్రామంలోకి వెళ్లి.. ఓ వ్యక్తికి ఇచ్చి.. దాన్ని పూర్తిగా పగలకొట్టాలని కోరారు. చెంబును లోపలికి తీసుకువెళ్లిన వ్యక్తి.. కొంత సేపటికి బయటకి వచ్చి చెంబులో ఏమి లేవని, దాన్ని బయట పడేయాలని చెప్పాడు. అయితే అప్పటికే యువకులు.. చెంబులో దొరికిన నాణేలను ఫోటో తీసుకున్నాడు. దాంతో ఆ వ్యక్తి తమకు అబద్ధం చెప్పాడని అర్థం చేసుకుని.. దీని గురించి పోలీసులకు తెలపాలని భావించారు. ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు.
ఆ తర్వాత వారంతా వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి విషయం చెప్పారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామానికి వెళ్లి.. ఆ వ్యక్తిని విచారించగా చెంబులో ఉన్న నాణేలను తానే దాచానని చెప్పాడు. ఇక అతడి వద్ద నుంచి 100 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. ఇక చెంబులో దొరికిన నాణేలు మూడు కేజీలకు పైగా వుంటాయని.. అవి కోట్ల రూపాయలు విలువ చేస్తాయని స్థానికులు అంటున్నారు. అయితే యువకులకు దొరికిన బంగారు నాణేలు ఏ శతాబ్ధానికి చెందినవో తెలియదు. కానీ, వాటిపై తాజ్ మహల్, ఇంకా ఉర్దూ పదాలు ఉన్నాయని చెప్పారు. బంగారు నాణేలు దొరికిన తర్వాత.. వాటాల్లో తేడా రావడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది అంటున్నారు స్థానికులు.