సంఘ విద్రోహ శక్తుల నుంచి CM జగన్‌కు ముప్పు.. భద్రత పెంపు

ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఇంటిలిజెన్స్‌ అధికారులు కీలక ప్రకటన చేశారు. సీఎం జగన్‌కు ముప్పు ఉందని తెలిపారు. ఆ వివరాలు...

ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఇంటిలిజెన్స్‌ అధికారులు కీలక ప్రకటన చేశారు. సీఎం జగన్‌కు ముప్పు ఉందని తెలిపారు. ఆ వివరాలు...

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మావోయిస్టులు, సంఘవిద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందంటూ ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీపీ ఆంజనేయులు తెలిపారు. ఈ బెదిరింపుల దృష్ట్యా సీఎం జగన్‌కు భద్రతను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు. ఇక జగన్‌కు ఇప్పటికే జెడ్‌ కేటగిరీ భద్రత ఉండగా.. తాజాగా ముప్పు అంటూ హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు మరింత భద్రత పెంచారు.

సీఎం జగన్‌ పర్యటనల నిమిత్తం.. రెండు ప్రత్యేక హెలికాప్టర్లను సిద్ధం చేశారు. విజయవాడ, విశాఖలో వీటిని అందుబాటులో ఉంచనున్నారు. అయితే లీజ్‌ ప్రతిపాదికన ఈ హెలికాప్టర్లను తీసుకుంది ప్రభుత్వం. ఒక్కో హెలికాప్టర్‌కు నెలకు 1.91 కోట్ల చొప్పున లీజు చెల్లించనున్నారు. ఏపీ ఏవియేషన్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా ఈ హెలికాప్టర్లను లీజుకు తీసుకున్నారు. ఎయిర్ పోర్టుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, పైలట్ల బస, రవాణా, ఇంధన రవాణా, హెలికాప్టర్ క్రూ వైద్య ఖర్చులు వంటి వాటికి గంటల ప్రతిపాదికన ఏటీసీకీ ఛార్జీలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

సీఎం జగన్‌ కోసం ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని ఏపీ ఏవియేషన్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ నిర్ధారించింది. ఈక్రమంలో ముఖ్యమంత్రితో పాటు వీవీఐపీల ప్రయాణాల కోసం రెండు హెలికాప్టర్లు అవసరమని భావించిన ఏపీ ఏవియేషన్‌ శాఖ మరో రెండు హెలికాప్టర్లు లీజుకు తీసుకుంది. ఇక సీఎం జగన్‌కు మావోయిస్టులు, టెర్రరిస్టులు, వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగ్‌లు, సంఘ విద్రోహశక్తుల నుంచి ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు. సీఎంకు భద్రత మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న భెల్ హెలికాప్టర్ 2010 నుంచి వినియోగిస్తున్నారన్న ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్‌… ప్రస్తుత హెలీకాప్టరును తక్షణం మార్పు చేయాలని పేర్కొంది. ఇంటెలిజెన్స్ డీజీ, ప్రోటోకాల్ విభాగాల సిఫార్సుల మేరకు సీఎం ప్రయాణాలకు అత్యాధునిక రెండు భెల్ హెలికాప్టర్లను సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.

Show comments