Dharani
Dharani
మనిషి విజయ తీరాలకు చేరాలంటే కావాల్సింది ఒక్కటే.. తన మీద తనకు మొక్కవోని నమ్మకం ఉండి.. తన లక్ష్యం చేరుకునే వరకు అలుపన్నది లేకుండా శ్రమిస్తే చాలు.. విజయం వారి దాసోహం అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి కూడా ఈ కోవకు చెందినదే. తండ్రి ఆటో డ్రైవర్.. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవేవి ఆమె ప్రతిభను అడ్డుకోవలేదు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతోనే తన ప్రతిభకు సాన పెట్టుకుంది. ప్రభుత్వం సాయంతో చదువులో ముందడుగు వేసి.. అరుదైన అవకాశం దక్కించుకుంది. ఏకంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించే సదస్సుకు ఎంపికయ్యింది ఏపీకి చెందిన ఆటో డ్రైవర్ కుమార్తె. ఆమె సాధించిన ఘనత చూసి ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు..
ఏపీ, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్‌లోని ఎటపాకకు చెందిన విద్యార్థిని మోతుకూరి చంద్రలేఖ అరుదైన ఘనత సాధించింది. ఐక్యరాజ్య సమితి విద్యా సదస్సులో పాల్గొనేందుకు ఎంపికయ్యింది. దీనికి సంబంధించి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి చంద్రలేఖకు సమాచారం అందింది. ఇక ఎటపాక కేజీబీవీలో గత విద్యా సంవత్సరం పదో తరగతి పూర్తి చేసిన చంద్రలేఖ.. 523 మార్కులు సాధించి జిల్లాలోని 19 కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. ఈ ఎంపిక కోసం ముందుగా సమగ్రశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానంపై విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించారు.
జులై 31న నిర్వహించిన ఈ రాతపరీక్షలో చంద్రలేఖ ఉత్తీర్ణురాలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల పాఠశాలల టాపర్లకు గత నెలలో.. జగనన్న ఆణిముత్యాలు పథకంలో భాగంగా ఆన్‌లైనలో పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ పరీక్షలో చంద్రలేఖ 100 మార్కులకు గాను 94 మార్కులు సాధించి ఆన్‌లైన్ ఇంటర్వ్యూకు ఎంపికయ్యింది. ఈ నెల 3న నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రలేఖ.. రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి విద్యా సదస్సులో పాల్గొనేందుకు ఎంపికైంది. రాష్ట్రంలో విద్యా విధానంపై ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రసంగించనుంది.
రాష్ట్రంలోని కేజీబీవీ విద్యాలయాల విభాగంలో చంద్రలేఖ ఒక్కతే ఎంపికవడం విశేషం. ఈమెతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీల నుంచి ఇద్దరు ఇంటర్వ్యూకు హాజరు కాగా.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన చంద్రలేఖ ఎంపికయ్యింది. త్వరలోనే ప్రభుత్వం చంద్రలేఖను అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థిని తండ్రి రామారావు ట్రాలీ ఆటో నడుపుతుంటారు.. ఆయన కష్టంతోనే కుటుంబం నడుస్తోంది.
మరోవైపు ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన ఈసీఈ ఆఖరి సంవత్సరం విద్యార్థులు 9 మంది అమెరికన్ మల్టీ నేషనల్ సెమీ కండక్టర్ కంపెనీ అయిన అన్‌లాగ్ డివైజెస్‌కి సెలక్ట్ అయ్యారు. ఆ సంస్థ ప్రతినిధులు ఈ విద్యార్థులను ఏడాది పాటు లాంగ్‌టర్మ్ ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేశారు. ఇంటర్న్‌షిప్ సమయంలో వీరికి నెలకు రూ.40వేలు చొప్పున స్టయిఫండ్ ఇస్తారు. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత వారి పని తీరు ఆధారంగా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.