చంద్రబాబు తరపు లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి!

సీమెన్స్‌ స్కాం కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జైలు అధికారులు ఆయనకు ఖైదీ నెంబర్‌ 7691 నెంబర్‌ను కేటాయించారు. ఆయనంటూ ఓ ప్రత్యేక గదిని కూడా ఇచ్చారు. ఆహారాన్ని సైతం ఇంటినుంచి తీసుకురావటానికి అనుమతి ఇచ్చారు. ఇక, ఈ నేపథ్యంలోనే చంద్రబాబును రాజమండ్రి జైల్లో కాకుండా ఇంట్లోనే ఉంచి ఆయన్ని విచారించేందుకు గానూ.. హౌస్‌ కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశారు. మధ్యాహ్నం ఈ పిటిషన్‌కు సంబంధించి ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. సీఐడీ తరపున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, స్పెషల్‌ జీపీ వివేకాదనంద వాదనలు వినిపించారు.

ఏసీబీ కోర్టులో సీఐడీ తరపు లాయర్ల వాదనలు ఇలా ఉన్నాయి.. ‘‘ చంద్రబాబు హౌస్‌ కస్టడీకి అనుమతిస్తే కేసును ప్రభావితం చేస్తారు. ఇంట్లో కంటే ఆయనకు జైల్లోనే భద్రత ఎక్కువ. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా.. పూర్తి భద్రత మధ్య ఉన్నారు. అరెస్ట్‌ సమయంలో కూడా చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు. సీఆర్‌పీసీలో హౌస్‌ కస్టడీ అనేదే లేదు. చంద్రబాబు కోరిన విధంగా కోర్టు ఆదేశాల మేరకు ఇంటినుంచి భోజనం, మందులు అందుతున్నాయి. రిమాండ్‌లో ఉన్న నిందితుడి భద్రతా బాధ్యత ప్రభుత్వానిదే. హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు. సుప్రీంకోర్టులోని కొన్ని కేసులను సైతం ఉదహరించారు. కోర్టు ఆ కేసుల వివరాలను అడిగింది. అంతేకాదు! కోర్టు చంద్రబాబు తరపు న్యాయవాదులను హౌస్‌ కస్టడీపై క్లారిఫికేషన్‌ కోరింది.

కొన్ని అంశాలపై మరిన్ని వివరాలను ఇవ్వమని అంది. అయితే, ఈ పిటిషన్‌కు సంబంధించి తీర్పు ఇచ్చే సమయంలో.. చంద్రబాబు తరపు న్యాయవాదులు మరో పిటిషన్‌ వేశారు. దీంతో చంద్రబాబు తరపు లాయర్లపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్‌ ఇచ్చే సమయానికి కొత్త పిటిషన్‌ వేస్తున్నారంటూ మండిపడ్డారు. వేరే కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని అన్నారు. వరుసగా పిటిషన్లు వేస్తే కోర్టు పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. కోర్టులో పిటిషన్లు వేయటానికి ఓ ప్రొసిజర్‌ ఉంటుందని అన్నారు. డైరెక్ట్‌గా పిటిషన్‌ వేసి విచారించాలనటం సరికాదన్నారు. పిటిషన​ వేయాలంటే మధ్యాహ్నం 12లోపే వేయాలని అది నెంబర్‌ అవ్వాలని అన్నారు.

ఇది కూడా చదవండి: జైల్లో మొదటోరోజు చంద్రబాబు లంచ్ ఇదే! ఆ స్పెషల్ కూడా!

Show comments