iDreamPost

తెలుగు సినిమా బేసిక్ రూల్స్

తెలుగు సినిమా బేసిక్ రూల్స్

తెలుగు సినిమాలకి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి.. వాటిని మార్చడం ఎవరివల్లా కాదు.. ఇప్పుడంటే తెలుగు సినిమాలు మారి కొంచెం విన్నూత్నమైన సినిమాలు వస్తున్నాయి కానీ ఒకప్పుడు రొటీన్ మూవీస్ ప్రేక్షకులకు అలవాటైపోయిన అనుభూతిని మిగిల్చేవి. ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో రొటీన్ సన్నివేశాలు అడపాదడపా కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఇవికొన్ని ..

★ వయసు అయిపోయిన హీరో కోసం, హీరోయిన్ ఎవర్నీ లవ్ చేయకుండా, 20ఏళ్ళ పైనే ఎదురు చూస్తుంది.. హీరో ఫైట్ చూడగానే ఇంప్రెస్ అయ్యే హీరోయిన్ ఫైట్ తరువాత చెప్పే నాలుగు డైలాగులు విన్న వెంటనే హీరోను లవ్ చేస్తుంది..

★ తెలుగు ఈరోయిన్లకు, కండల కాంతారావులు అస్సలు నచ్చరు.. కేవలం బొజ్జ ఉండి, కళ్ళ కింద క్యారీబాగ్ లు ఉన్న హీరోలు మాత్రమే ఎక్కువగా నచ్చుతారు..

★ తెలుగు సినిమాల్లో హీరోయిన్ చెంపపై హీరో కొట్టగానే ఆడపిల్లననే విషయం అకస్మాత్తుగా గుర్తొచ్చి, హీరోని లవ్ చేస్తుంది..

★ తెలుగు సినిమాల్లో వాన కేవలం, హీరోయిన్ గంతులు వేస్తూ, పాటలు పాడుకోవడానికి, హీరో మృగంలా మారి ఫైట్స్ చేయడానికి తప్ప ఎందుకూ పనికిరాదు.

★ ఫ్లాష్ బ్యాక్ లో హీరో నగర బహిష్కరణ అయ్యాక, విలన్ బాచ్, హీరో ఫోటో ఒకటి పట్టుకుని, కేవలం రోడ్లపై తిరుగుతూ, హీరోని వెతుకుతూ ఉంటారు..అది కూడా కొన్ని రోజుల్లోనే దేశం మొత్తం తిరిగేస్తారు.. కానీ వాళ్ళ ఊరి పక్కనే ఉన్న, హైదరాబాద్ లో ఉన్నాడని ఇంటర్వెల్ ముందు తెలుసుకుంటారు

★ సినిమా సగంలోనే, విలన్ ని చంపే అవకాశం, హీరోకి వస్తుంది. విలన్ ని చంపితే సినిమా అయిపోతుందన్న భయమో లేక వేరే ఇతర కారణాల వల్లనో విలన్ ని చంపడు… నీ కళ్ళముందే నీ సామ్రాజ్యాన్ని కూలదోస్తాను, అని పంచ్ డైలాగ్స్ కొట్టి, విలన్ ని వదిలేస్తాడు.

★ విలన్ పక్కన, ఒక కమెడియన్ ఎప్పుడూ ఉంటాడు..విలన్ చెప్పే సీరియస్ డైలాగ్స్ కి సెటైర్స్ వేస్తూ ఉంటాడు..లేకుంటే తనలో తానే గొణుక్కుంటూ లేని కామెడీని పుట్టించడానికి ప్రయత్నిస్తాడు. అయితే విలన్ హీరోని చంపిన తర్వాతే నిన్ను చంపుతాను అని కమెడియన్ కి మాట ఇస్తాడు ,కాబట్టి కమెడియన్ ఎంత విసిగించినా, ఇచ్చిన మాట ప్రకారం చంపడు.

★ వైద్యశాస్త్రానికి కూడా ,అంతు చిక్కని దెబ్బలు, ఈరో కొట్టగలడు… అవి x-ray,బాడీ స్కానింగ్ లో కూడా దొరకవు.. కేవలం జిరాక్స్ లో మాత్రమే దొరుకుతాయి.. ఈ రిపోర్టులను చూసిన డాక్టర్ ఆ దెబ్బలు కొట్టిన హీరో లక్షణాలను వర్ణిస్తూ విలన్ ని భయపెడతాడు.

★ ఎన్ని ఘోరాలు చేసినా,ఎంత మందిని చంపినా, విలన్ ని సినిమా క్లైమాక్స్ లో 4 మంచి మాటలు చెప్పి హీరో మార్చగలడు..

★ పాత సోషియో ఫాంటసీ తెలుగు సినిమాల్లో, హీరో యముడితో, స్టయిల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే, పాపం ఆ “తెలుగు మీడియం గాడ్స్”మాత్రం,హీరో మాట్లాడిన ఇంగ్లీష్ పదాలకు అర్థం తెలియక, బిక్కమొహం వేస్తారు.. ఆ ఇంగ్లీష్ పదాలకు, దేవుళ్లకే అర్థం చెప్పిన తెలుగు హీరో, ఈ మాత్రం చిన్నవిషయం దేవుళ్ళకు తెలియదని హేళన చేస్తాడు…దేవుళ్ళకంటే తెలివైనవాడని నిరూపించుకుంటాడు…

తెలుగు సినిమాల్లో ఇలా చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. కానీ ఎక్కువగా రిపీట్ అయ్యే సన్నివేశాల్లో పైన చెప్పిన విషయాలు ఎక్కువగా ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి