iDreamPost

నవంబర్ 4 – క్లియరెన్స్ సేల్..

నవంబర్ 4 – క్లియరెన్స్ సేల్..

చాలా రోజుల తర్వాత ఏ పెద్ద సినిమా లేని ఓ శుక్రవారం దొరకడంతో చిన్న సినిమాలు మూకుమ్మడి దాడి చేయబోతున్నాయి. నవంబర్ 4న ఏకంగా తొమ్మిది సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అల్లు శిరీష్ ఊర్వశివో ‘రాక్షసివో’ అందులో మొదటిది. తమిళ రీమేక్ గా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. బయటికి చెప్పని కారణాల వల్ల ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. ఆహాకు యాక్టింగ్ పార్ట్ నర్ గా మారిపోయిన బాలకృష్ణను ముఖ్యఅతిథిగా తీసుకొచ్చి హైదరాబాద్లో  ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. వీటి సంగతి ఎలా ఉన్నా దీనికి బజ్ ఎంతమాత్రం లేదు. యూత్ నుంచి ఓ రేంజ్ టాక్ వస్తే తప్ప పుంజుకోవడం కష్టం.

ఓటిటి స్టార్ గా మారిపోయిన సంతోష్ శోభన్ జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా రూపొందిన ‘లైక్ షేర్ సబ్స్క్రైబ్’ కంటెంట్ ని నమ్ముకుని వస్తోంది. నాని, శర్వానంద్ లాంటి పెద్ద హీరోలతో చేసిన దర్శకుడు మేర్లపాక గాంధీకి ఇది సక్సెస్ కావడం చాలా కీలకం. ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ చేయించి ఆ బ్రాండ్ మీద ప్రమోట్ చేసుకుంటున్నారు కానీ ఇదీ ఓపెనింగ్ కోసం కష్టపడాల్సిందే. కన్నడలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘బనారస్’ అదే రోజు రానుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ లవ్ థ్రిల్లర్ మీద సామాన్య ప్రేక్షకులకు కనీస అవగాహన లేదు. ఎప్పటి నుంచో ల్యాబ్ లో మగ్గుతున్న నందు ‘బొమ్మ బ్లాక్ బస్టర్’కు ఇన్నాళ్లకు మోక్షం దక్కింది.

ఇవి కాకుండా జెట్టి అనే జాలర్ల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ, మిస్టర్ తారక్, సారధి, ఆకాశం, తగ్గేదేలే అనే మరో అయిదు చిన్న సినిమాలు సై అంటున్నాయి. చాలా సెంటర్స్ లో వీటికి రిలీజ్ కూడా లేదు. ఇన్నేసి వస్తే థియేటర్లను బయ్యర్లైనా ఎక్కడి నుంచి సర్దగలరు. కాంతార తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో జనాన్ని థియేటర్ కు రప్పించే బొమ్మ అయితే కనిపించడం లేదు. క్లియరెన్స్ సేల్ స్కీం కింద వస్తున్న ఈ సినిమాలన్నీ పూర్తిగా టాక్ మీద ఆధారపడాల్సిందే. ఒకవేళ చాలా బాగుందనే మాట వేటికైనా వస్తే ఆటోమేటిక్ గా వీకెండ్ నుంచి కలెక్షన్లను ఆశించవచ్చు. తిరిగి నవంబర్ 11 ఎక్కువ రిలీజులున్న నేపథ్యంలో ఈ వారమే వీటికి కీలకం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి