iDreamPost

చిన్న సినిమాల ఓటిటి కష్టాలు

చిన్న సినిమాల ఓటిటి కష్టాలు

ఒకే రోజు రెండు సినిమాలు హిట్ అయినంత మాత్రాన అంతా బాగున్నట్టు కాదని ఓ ఇండస్ట్రీ పెద్ద మాట. నిజం లేకపోలేదు. పెద్ద బ్యానర్ల అండదండలు, రాజీ పడని నిర్మాణం, స్టార్ గెస్టులతో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, వీటన్నింటిని మించి మంచి కంటెంట్ ఫైనల్ గా కోరుకున్న ఫలితాన్ని ఇచ్చిన మాట వాస్తవం. ఒకవేళ ఇదే ప్రతివారం రిపీట్ అయితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఒక్క ఫ్లాప్ వచ్చినా కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ఇండస్ట్రీ పెద్దలు సమస్యల గురించి చర్చలు కొనసాగిస్తున్న తరుణంలో పలు అంశాలు తెరమీదకొస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల మనుగడ చాలా ఇబ్బందిగా మారింది. ఏడాది క్రితం థియేటర్లలో విడుదల చేసే శక్తి లేకపోతే ఓటిటిలు ఆదుకునేవి. కానీ ఇప్పుడా సీన్ రివర్స్ అయ్యింది.

ముందు రిలీజ్ చేశాక మా దగ్గరకు రండి అప్పుడు చూద్దామని మెలిక పెడుతున్నాయి. క్యాస్టింగ్ లేని చిత్రాలను అంత సులువుగా విడుదల చేసే పరిస్థితులు లేవు. నిర్మాత చేతి నుంచి ముప్పై నుంచి యాభై లక్షల దాక చేతి చమరు వదిలించుకున్నాకే తెరమీద బొమ్మ పడుతుంది.ఒకవేళ బాగుందనే మాటొస్తే సరి లేదంటే నాలుగో రోజుకే ఆటలు చెల్లు. సరే మీరు చెప్పారు కదా ఇదిగో రిలీజ్ చేసుకుని వచ్చామని మళ్ళీ ఓటిటిల వద్దకు వెళ్తే అబ్బే మీ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది, రివ్యూస్ కూడా బాలేవని ఇంతే రేట్ ఇస్తామని తెగేసి చెబుతారు. నిర్మాతకు హార్ట్ అటాక్ వచ్చినంత పనవుతుంది. ఓ ఉదాహరణ చూద్దాం. ఓ ప్రొడ్యూసర్ రెండున్నర కోట్లలో ఓ సినిమా తీశాడు.

పబ్లిసిటీ ఖర్చులు ఇంకో అరకోటి. థియేటర్ విడుదల కోసం ఇంకో యాభై లక్షలయ్యాయి. అంటే మొత్తం మూడున్నర కోట్లు. తీరా చూస్తే బొమ్మ ఫ్లాప్. ఓటిటి వాడు కోటిన్నర ఇస్తామన్నాడు. లేదూ అంటే ఇంకో ప్రపోజల్ పెడతాడు. ముందు ప్లాట్ ఫార్మ్ లో పెడదాం, వ్యూస్ ని బట్టి వచ్చే ఆదాయాన్ని పంచుకుందామన్నాడు. ఇదింకా డేంజర్. ఈ లెక్కల గందరగోళం మాములుగా ఉండదు. అంతుచిక్కని చిక్కుముడులు ఎన్నో ఉంటాయి. ఏదో వైరల్ కంటెంట్ ఉంటే ఎక్కువ శాతం చూస్తారు లేదంటే లేదు. ముసలోడి పెళ్లికి వచ్చిందే కట్నంలా ఉంటుంది.  అందుకే వెనుక నడిపించే బడా చేతులు లేకపోతే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిపోయింది చోటా ప్రొడ్యూసర్ల పరిస్థితి. కరోనా టైంలో ఏదో చెల్లిపోయింది కానీ ఇప్పుడు ఓటిటి స్ట్రాటజీలు మారిపోవడంతో షాకులు తప్పడం లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి